జవాన్లకు అండగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌‌లు

జవాన్లకు అండగా  లీగల్ ఎయిడ్ క్లినిక్‌‌లు
  • మరో 8 ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ 

హైదరాబాద్, వెలుగు: సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి లీగల్‌‌ ఎయిడ్‌‌ క్లినిక్‌‌లు సహాయ సహకారాలు అందిస్తాయని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జవాన్లు, వారి కుటుంబాల సమస్యలను పరిష్కరించడానికి 8 జిల్లాల్లో లీగల్‌‌ ఎయిడ్‌‌ క్లినిక్‌‌లను ఆన్‌‌లైన్‌‌ ద్వారా రాష్ట్ర లీగల్‌‌ సర్వీసెస్‌‌ అథారిటీ ప్యాట్రన్‌‌ ఇన్‌‌ చీఫ్, చీఫ్‌‌ జస్టిస్‌‌ ఏకే సింగ్, ఎగ్జిక్యూటివ్‌‌ చైర్మన్‌‌ జస్టిస్‌‌ పి.శ్యాంకోశీ  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు అండగా ఉండటానికి లీగల్‌‌ ఎయిడ్‌‌ క్లినిక్‌‌లు ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సైనికులు, వారి కుటుంబాలకు దేశవ్యాప్తంగా ఉచిత న్యాయసేవలను అందించాలని జాతీయ న్యాయసేవాధికార సంస్థ(నల్సా) నిర్ణయించిందని, ఇందులో భాగంగా గత నెల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 2 లీగల్‌‌ ఎయిడ్‌‌ క్లినిక్‌‌లను ప్రారంభించామని చెప్పారు.

 నెల రోజుల్లోనే మరో 8 క్లినిక్ లను (ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌‌నగర్, సంగారెడ్డిలో) ప్రాంరభించామన్నారు. కార్యక్రమంలో జస్టిస్‌‌ పి.శ్యాంకోశీ మాట్లాడుతూ.. లీగల్‌‌ ఎయిడ్‌‌ క్లినిక్‌‌లను మొత్తం 33 జిల్లాల్లోనూ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. న్యాయపరమైన సమస్యలే కాకుండా వారి కుటుంబానికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు, ఇతర సమస్యలు ఏవైనా లీగల్‌‌ ఎయిడ్‌‌ క్లినిక్‌‌ల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ గోవర్ధన్‌‌ రెడ్డి, సీహెచ్‌‌ పంచాక్షరి, శాంతివర్ధని తదితరులు పాల్గొన్నారు.