వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్లో వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన 60వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధి కోసం ఇచ్చిన మాట ప్రకారం యూజీడీతో పాటు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి పనులు త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు చెప్పారు.
మామునూర్ ఎయిర్పోర్ట్ భూసేకరణ దాదాపుగా పూర్తయిందని, పనుల శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని ప్రజా రవాణా అందించేలా కాజీపేట ఆర్వోబీ పనులను పూర్తి చేస్తామన్నారు. దీనికి అవసరమైన చివరి దశ పనులు రైల్వేశాఖ పరిధిలో ఉన్నందును వారిని రెక్వెస్ట్ చేశామన్నారు.
కమ్యూనిటీ హాల్ భూపట్టాలు అందజేత..
అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ ప్రకారం కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని తెలిపారు. శుక్రవారం 54వ డివిజన్ పోచమ్మకుంటలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ, సగర (ఉప్పర) కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన భూకేటాయింపు పత్రాలను సంఘాల పెద్ద మనుషులకు అందించారు. ఇదే ప్రాంతంలోని పోచమ్మ ఆలయ అభివృద్ధికి నిధుల పరంగా సహకరించనున్నట్లు తెలిపారు.
