భూపాలపల్లి రూరల్/ మొగుళ్లపల్లి, వెలుగు: ఏండ్ల తరబడి ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులను గుర్తించి భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. బుధవారం ఐడీవోసీ ఆఫీస్లో భూపాలపల్లి డివిజన్ పరిధిలోని రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మండలాల వారీగా ప్రభుత్వ భూముల్లో సాగులో ఉన్న రైతులు, భూ సమస్యల వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మారావుపేటలోని రైతులు దీర్ఘకాలంగా సాగు చేస్తున్న భూమిలో సింగరేణి గనులు ఏర్పాటుతో కొందరు రైతులు భూములు కోల్పోయారని వారికి పరిహారం అందించాలన్నారు. గనులు ఏర్పాటు తదుపరి మిగిలిన భూములను సాగు చేస్తున్న రైతులకు భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు వివాదాలు లేని భూములను లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
