- లక్కీడ్రా పద్ధతిలో 863 మంది భూనిర్వాసిత రైతులకు అందజేత
- 10 ఏండ్ల తర్వాత ఇండ్లరాకతో లబ్ధిదారుల్లో ఆనందం
- పట్టాలు అందించిన ఎమ్మెల్యే రేవూరి, కుడా చైర్మన్ ఇనగాల, కలెక్టర్ సత్యశారద
- రైతులు అంగీకరిస్తే రూ.5 లక్షలతో ఇండ్లు కట్టిస్తామని వెల్లడి
వరంగల్, వెలుగు: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసింది. బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కోనాయిమాకుల పీఎస్‍ఆర్ గార్డెన్ లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ సత్యశారద లబ్ధిదారులకు పట్టాలను అందించారు. గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని 863 మంది రైతు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.
10 ఏండ్ల తర్వాత నెరవేరిన ఇండ్ల హామీ..
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం 2016లో గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని శాయంపేట హవేలి, చింతలపల్లి ఏరియాల్లో దాదాపు 1270 ఎకరాల భూములు సేకరించింది. కోట్లాది విలువ చేసే భూములను రూ.10 లక్షలకు ఎకరం చొప్పున బలవంతంగా గుంజుకుంది. దీనికి సాకుగా రెండేళ్లలో ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికితోడు బాధిత రైతులకు పార్క్ దగ్గరే డబుల్ బెడ్‍రూం ఇండ్లు కట్టిస్తామని మాటిచ్చారు. 2017లో పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఏడాదిలో పార్క్ప్రారంభిస్తామని చెప్పినా 2023లో కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయే వరకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‍రెడ్డి టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించారు. భూములిచ్చిన రైతులకు ప్రత్యేక అనుమతులతో ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఆ ప్రాంతాన్ని రాజీవ్‍గాంధీ టౌన్‍షిప్ పేరుతో అభివృద్ధి చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లా ఉన్నాతాధికారులు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవడంతో మొత్తంగా 2016 ఇచ్చిన హామీ 2026లో నెరవేరింది.
సర్కారే ఇండ్లు కట్టించేలా అవగాహన..
టెక్స్టైల్ పార్క్ రాబోయే రెండుమూడు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున 863 మంది భూనిర్వాసితులకు వేగంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రూ.5 లక్షలతో అధునాతన మోడల్‍లో (రెడీమేడ్) తక్కువ టైంలో నిర్మాణాలు చేసేలా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బుధవారం గీసుగొండలో జరిగిన ఇండ్ల పట్టాల పంపిణీలో సదరు కంపెనీల ప్రతినిధులు ఎల్‍ఈడీ స్క్రీన్‍పై ఇండ్ల నిర్మాణ సైజ్, నిర్మాణ తీరును వివరించారు. తమ ప్రతిపాదనకు అంగీకారం తెలిపేవారికి రూ.5 లక్షల్లో ఇంటి నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
రూ.43.15 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు..
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.43 కోట్ల 15 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం భూనిర్వాసితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్యాయం చేస్తే, రేవంత్‍రెడ్డి సర్కారు వారికి సరైన న్యాయం చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 50 గజాలు కేటాయించాల్సి ఉండగా, ప్రత్యేక అనుమతులు తీసుకొచ్చి 75 గజాల్లో ఇండ్లు నిర్మించేలా చూశామన్నారు.
పార్క్ఏరియా చుట్టూరా కుడా లేఔట్ లేకుండా అనాధికార వెంచర్లు చేస్తున్నారని, వారిపై చర్యలు తప్పవన్నారు. ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పార్క్ భూనిర్వాసిత రైతుల కోసం నిర్మిస్తున్న రాజీవ్‍గాంధీ టౌన్‍షిప్‍లో కావాల్సిన మౌలిక వసతులను కుడా తరఫున చేపడుతున్నామన్నారు. కుడా పర్మిషన్ లేకుండా చేపట్టిన అనధికార లేఔట్లు, నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఆర్డీవో సుమ తదితరులు పాల్గొన్నారు.
