ములుగు, వెలుగు : వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, యుద్ధ ప్రతిపాదికన ఇందిరమ్మ నిర్మాణాలు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లాలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందేవిధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ లో మంత్రి కలెక్టర్ దివాకరతో కలిసి తాగు, సాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, గొత్తికోయ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళికతో చేతిపంపు, ట్రాక్టర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. యుద్ధ ప్రతిపాదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చూడాలని, లబ్ధిదారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్మాణాలలో వేగం పెంచేలా చూడాలన్నారు. జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు తొలిసారిగా రూ.200కోట్లతో గోదావరి జలాలను జిల్లాకు మళ్లిస్తామని స్పష్టం చేశారు.
మల్లంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దాలి..
మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని, త్వరలోనే మండల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం మల్లంపల్లిలో రూ.10లక్షలతో గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి, రూ.72.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.20లక్షలతో నిర్మించిన శ్రీనగర్ జీపీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ములుగు మండలం జగ్గన్నపేటలో రూ.కోటి 50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, డీఆర్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
