హైదరాబాద్‌ లో తాగునీటి బోర్లకే పర్మిషన్..నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు : సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్‌ లో తాగునీటి బోర్లకే పర్మిషన్..నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు : సీఎస్ సంజయ్ జాజు
  •      ఐఏఎస్ అధికారులతో సీఎస్ సంజయ్ జాజు
  •     ఎల్ నినో ముప్పుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఇకపై తాగునీటి బోర్లకే పర్మిషన్ ఇస్తామని  సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడేవారిపై 'హైడ్రా' సహాయంతో స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధిగకారులను సీఎస్ ఆదేశించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐఏఎస్ అధికారులతో మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోయినా వ్యవసాయానికి, గృహాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని.. పరిశ్రమలకు పవర్ కట్ లేదని సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం 6  దాటాక ఏసీలు బంద్‌ చేయాలని, పగటిపూట 25 డిగ్రీలకే పరిమితం చేయాలన్నారు. థర్మల్ ప్లాంట్లలో గరిష్ట ఉత్పత్తి సాధించాలని, యాదాద్రి ప్లాంట్ కోసం ఐదుగురు స్పెషల్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. ఎల్-నినోపై త్వరలోనే అఖిలపక్ష, కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలు ఉంటాయని సీఎస్ వెల్లడించారు.కాగా..వ్యవసాయంలో కరెంట్ మోటార్లతో అక్రమంగా నీటిని తోడటంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలుతున్నాయని విద్యుత్ అధికారులు సీఎస్ దృష్టికి తెచ్చారు.

లోటు భర్తీకి మిషన్ భగీరథ, కృష్ణా జలాల మళ్లింపు

సీఎస్ జయేష్ రంజన్  మాట్లాడుతూ.. మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో  నీటి లభ్యత లేకపోవడంతో వచ్చే 110 ఎంజీడీ(మిలియన్ గాలెన్స్ పర్ డే)ల లోటును భర్తీ చేసేందుకు మిషన్ భగీరథ నుంచి 60 ఎంజీడీలు, కృష్ణా నీటిని మళ్లిస్తున్నామని వివరించారు. నవంబర్ 1 నుంచి నిర్మాణ రంగానికి ఎస్‌టీపీ వాటర్ గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలు చేస్తున్నామని వికాస్ రాజ్, నల్గొండలో ఉపాధి హామీ పనులు పెంచుతున్నామని హరిచందన, కరీంనగర్‌లో జూన్ వరకు తాగునీటి తిప్పలు లేవని బీడీ ఎక్కా, ఆదిలాబాద్‌లో పశుగ్రాసం కొరత రాకుండా చూస్తున్నామని ఇలంబర్తి వెల్లడించారు. మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేటలకు జూన్ వరకు నీరివ్వాలంటే పాలేరులో 4 టీఎంసీలు కావాలని, ప్రస్తుతం 2 టీఎంసీలే ఉన్నాయని ఖమ్మం స్పెషల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో సీనియర్ అధికారులు నవీన్ మిత్తల్, సురేంద్ర మోహన్, టీకే శ్రీదేవి, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.