ఆఫీసర్‍ నరాలు చిట్లేవరకు ఫోన్‍ చేయండి

ఆఫీసర్‍ నరాలు చిట్లేవరకు ఫోన్‍ చేయండి
రోడ్డు పనులపై కాలనీవాసులకు చీఫ్‍ విప్‍ వినయ్‍ భాస్కర్‍ అడ్వయిజ్‍ వరంగల్ రూరల్, వెలుగు: ‘అమ్మాలారా.. ఈ రోజు మీ జ్యోతిబస్‍ కాలనీలో రోడ్డు పనులకు కొబ్బరికాయ కొడుతున్నం. మన మున్సిపల్‍ ఆఫీసర్‍ నెల రోజుల్లో మొత్తం పని కంప్లీట్‍ చేస్తమంటున్నరు. ఒకవేళ టైం దాటితే.. ఆయన సెల్‍ నంబర్‍కు మొదటిరోజు ఐదుగురు ఫోన్‍ చేయండి. తెల్లారి పదిమంది చేయండి. ఆ తర్వాత వరుసబెట్టి ఆఫీసర్‍ నరాలు చిట్లేవరకు ఫోన్‍లో విసిగించండి. ఇదిగో.. అందరూ అతని సెల్‍ నంబర్‍ రాసుకోండి’ అంటూ ప్రభుత్వ చీఫ్‍ విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍ కాలనీవాసులకు నంబర్‍ ఇచ్చి సరికొత్త అడ్వయిజ్‍ ఇచ్చారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‍కుమార్‍తో కలిసి  వినయ్‍భాస్కర్‍ సోమవారం వరంగల్​ సిటీలోని 30వ డివిజన్‍ పెద్దమ్మగడ్డలో పర్యటించారు. రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. డీఈ రవికుమార్‍ను ఎప్పటివరకు వర్క్​పూర్తి చేస్తావంటూ అడిగారు. నెల టైం పడుతుందని చెప్పడంతో పబ్లిక్‍ తో పైవిధంగా పేర్కొన్నారు. అనంతరం కాకతీయ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక లీడర్లు నాలా ఆక్రమణలను తొలగించని విషయాన్ని చీఫ్‍ విప్‍ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ఎమ్మెల్యే సంబంధిత ఆఫీసర్లపై సీరియస్‍ అయ్యారు. మంత్రి, ఎమ్మెల్యే చెప్పినా వినని ఈ అధికారులపై మీరు వార్తలు రాయండి అంటూ అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు సూచించారు.