చైనా కొత్త శత్రువేం కాదు

చైనా కొత్త శత్రువేం కాదు

చైనా రూపంలో ఇప్పుడు మనకు పొరుగున కొత్త శత్రువు ఏర్పడిందా? 1962లో చైనాతో ఇండియా పాక్షిక యుద్ధం చేసింది. 1967, 1987 లో సైనికపరంగా ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పాకిస్తాన్‌తో పోల్చితే చైనాను శత్రువుగా పరిగణించలేదు. 70, 80, 90ల్లో హిందీ–చీనీ భాయ్ భాయ్‌ అన్నది ప్రముఖ స్లోగన్గా సాగింది. అప్పటి ప్రభుత్వాల వైఖరి కూడా అలాగే ఉంది. ఫైనాన్స్లోనే మొత్తం పవర్ ఉందనే విషయాన్ని చైనా వాళ్లు అప్పట్లోనే అర్థం చేసుకున్నారు. 1948 నుంచి చైనా నేషనల్ ఎజెండాను దాని పాపులేషన్ సైజ్ కమాండ్ చేస్తోంది. సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ముసుగులో చైనాకు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్ట్‌ పార్టీ.. కేపిటలిస్టిక్ పాలసీని అనుసరిస్తూ “స్వేచ్ఛా ఆర్థిక ఎజెండాను” 70ల నుంచి అమలు చేస్తోంది. ఫైనాన్షియల్ ఛాలెంజెస్కు లొంగిపోకుండా చైనా తన ఫైనాన్షియల్ పాలసీని
రూపొందించుకుంది.

లాంగ్ టర్మ్ టార్గెట్లు లేవు

నెహ్రూ వారసుల నేతృత్వంలోని ఇండియన్ గవర్నమెంట్స్.. రాజకీయ మనుగడ, లైసెన్స్‌ రాజ్‌, ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తూ ఆర్థిక వ్యవస్థకు చిగురులు తొడిగే ప్రయత్నాలు చేశాయి. మల్టీ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థతో కూడిన ఇండిపెండెంట్ ఇండియా 1947 నుంచి 1977 వరకు మూడు దశాబ్దాల పాటు సుస్థిరమైన ప్రభుత్వ పాలనలో ఉంది. ఆ టైమ్లో లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ టార్గెట్లకు వ్యూహరచన జరగలేదు. రాజకీయ మనుగడ, సొంత ప్రయోజనాలపైనే అప్పటి రాజకీయ నాయకత్వం దృష్టి పెట్టడంతో 70, 80ల్లో వచ్చిన భారీ ఆర్థిక అవకాశాలను ఇండియా అందుకోలేకపోయింది. దీంతో 1990ల్లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. మనుగడ సాగించడం కాదు ఆర్థికంగా శక్తిమంతమైన మార్గంలో ప్రయాణించేలా ఫైనాన్షియల్ పాలసీలను రూపొందించుకునేలా చేసింది. కానీ చైనా అప్పటికే ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది. తయారీ రంగం, వాణిజ్యం తమ ప్రధాన శక్తిగా గుర్తించి ఇండియా కంటే 25 ఏండ్లు ముందుగానే పెట్టుబడులు పెట్టింది.

50 ఏండ్లుగా సజీవంగానే ఘర్షణలు

గజరాజుగా చెప్పుకునే ఇండియా మందకొడి ఆర్థిక, విదేశాంగ విధానాలతో పెద్దదేశంగా మాత్ర మే మిగిలింది. చైనాలా దూకుడుగా వ్యవహరించేందుకు ఇండియాకు శక్తి లేకుండా పోయింది. వ్యూహాత్మక నాయకత్వమంటే చివరి నిమిషంలో ప్రతిచర్యతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం కాదు. వ్యూహాలనేవి దీర్ఘకాలంలో అమలు చేసేలా దార్శనికతతో, స్పష్టమైన లక్ష్యాలతో ఉండాలి. చర్యలు, ప్రతిచర్యలు, తీర్మానాలు, దూకుడుగా ప్రమాదాన్ని ఎదుర్కొనే మార్గాలూ ఉండాలి. 1962, 67, 87లో జరిగిన సైనిక సంఘర్షణల తర్వాత కూడా చైనాను శత్రుదేశంగా ఇండియా పరిగణించలేదు. మన సమగ్రతకు అది ముప్పనే విషయాన్ని పట్టించుకోలేదన్నది వాస్తవం. వివిధ వేదికలు, అంతర్జాతీయ సమావేశాల ద్వారా తదుపరి ప్రభుత్వాలు పర్మినెంట్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుని చైనాతో బార్డర్ టెన్షన్లను 50 ఏండ్లుగా సజీవంగానే ఉంచాయి.

1. అసమర్థ రాజకీయ నాయకత్వం

దేశాన్ని నెహ్రూ ఫ్యామిలీ దాదాపు ఆరు దశాబ్దాలు ఏలింది. ఎటువంటి పనులు చేయకుండా, మార్పులు తీసుకురాకుండా, సంస్కరణలు చేపట్టకుండా అధికారంలో కొనసాగే అదృష్టం కాంగ్రెస్కే లభించింది. కాంగ్రెస్ పాలనలో దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక సమస్యలు, ఘర్షణలు ఏర్పడ్డాయి. ఒక్కదాన్ని కూడా ఆ పార్టీ చక్కదిద్దలేకపోయింది. ఘర్షణలు సృష్టించడమే కాదు దశాబ్దాల పాటు అవి అనేక రెట్లు పెరిగేలా చూసింది. దేశీయ, అంతర్జాతీయ ఘర్షణల విషయంలో యథాతథ స్థితి కొనసాగించడమన్నది కాంగ్రెస్ రాజకీయ ఎజెండాగా కనిపిస్తోంది. వారి తరహా రాజకీయాలకు అది సరిపోయింది. చైనా బలమైన విరోధి అని, శత్రువనే విషయాన్ని పట్టించుకోకపోవడం కాంగ్రెస్ అసమర్థ పరిపాలనకు నిదర్శనం కాదా? చైనాను కాంగ్రెస్ ప్రభుత్వాలు శత్రుదేశంగా పరిగణించి ఉంటే ఆ దేశాన్ని ఎదుర్కొనేందుకు స్ట్రాటజిక్ పాలసీ ఏది? చైనాను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలేవి? 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఘర్షణల నివారణకు ద్వైపాక్షికంగా సాధించిన విజయాలేవి?

2.అచేతన స్థితిలో అధికార యంత్రాంగం

రాజకీయ పెద్దలకు బానిసలుగా ఉండే ఇంపీరియల్ పాలసీలను పట్టుకుని వేలాడు తూ, ఫలితాల సాధనను గాలికొదిలేసిన కారణంగా అధికార యంత్రాంగం పూర్తిగా అన్కాన్షియస్లోకి జారిపోయింది. జాతీయ, ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ కు పరిష్కారాలు కనుగొనలేకపోతోంది. దేశానికి శత్రువులను గుర్తించేందుకు రాజకీయ నాయకత్వానికి క్లారిటీ, దార్శనికత ఉండాలి. అదే టైమ్లో దేశం ఎదుర్కొంటున్న ఘర్షణలు, రాబోయే ముప్పును విశ్లేషించి, వాటికి పరిష్కారాలు కనుగొనాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిది. శత్రు రాజ్యంగా పరిగణిస్తూ దాన్ని ఢీకొనేందుకు సమర్థవంతమైన, శక్తిమంతమైన, దూకుడుతో కూడిన విధానం అన్నది దశాబ్దాలుగా లేనేలేదు. చైనా, ఇండియా మధ్య వివాదాలకు సంవత్సరాలుగా పరిష్కారం దొరకట్లేదంటే కారణం ఎవరు? పరిష్కారం మాట అటుంచి, కనీసం శత్రువుపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలూ లేవు.
దౌత్యపరంగా, ఇతర మార్గాల ద్వారా ఏం సాధించలేదంటే అది అధికార యంత్రాంగం వైఫల్యం కాదా?

3.నిజాయితీకి లేని విలువ

చైనా శత్రుదేశం అని చెప్పేందుకు తగిన ధైర్యం, నిజాయితీ లేక దాన్ని కప్పిపుచ్చేందుకు ఇందిరా గాంధీ పాలనలో హిందీ–చీనీ భాయ్ భాయ్ నినాదాన్ని ప్రచారం చేశారు. డెమోక్రసీలో నిజాలను దాచిపెట్టాల్సిన అవసరంలేదు. పాలనలో నిజాయితీ ఉండాలి. పాక్ను శత్రుదేశంగా ముద్రవేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు చైనా విషయంలో అలాంటి ముద్ర వేయలేకపోయాయి. ఒకసారి శత్రు వు అయితే ఎప్పుడూ శత్రువుగానే ఉండాల్సిన అవసరంలేదు. విధాన నిర్ణయాల్లో నిజాయితీ ఉంటే.. అనుకోని ఘటనలు దీటుగా ఎదుర్కొనేలా, సైన్యం ఇతర విభాగాలు సిద్ధమయ్యేలా దోహదపడుతుంది. కాంగ్రెస్ పాలనలో ఫారిన్ పాలసీకి సంబంధించి నిజాయితీ అనే మాటకు విలువే లేదు. నిర్దేశించుకున్న సమయంలోపు సమస్యలు, ఘర్షణలను రెండు దేశాలు పరిష్కరించుకోకపోతే చైనా మనకు శత్రు దేశమే అవుతుంది. ఈ మాటలను మన దేశం, ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా స్పష్టంగా వ్యక్తం చేయాలి. ఇంటర్నేషనల్ వ్యవహారాలలో నిజాయితీగా ఉంటే కోల్పోయే దాని కన్నా పొందేదే ఎక్కువ ఉంటుంది.

– కె.కృష్ణ సాగర్రావు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి

మ‌రిన్ని ఇక్క‌డ క్లిక్ చేయండి