జాడ లేని ‘జాక్ మా’.. అలీబాబా సంస్థ ఫౌండర్ మిస్సింగ్

జాడ లేని ‘జాక్ మా’.. అలీబాబా సంస్థ ఫౌండర్ మిస్సింగ్
ప్రముఖ చైనా వ్యాపారవేత్త, అలీబాబా సంస్థ వ్యవస్థాపకుడు జాక్ మా రెండు నెలల నుంచి కనిపించడం లేదని తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో వివాదం తలెత్తినప్పటి నుంచి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జాక్ మా బయటకు రావడం లేదని సమాచారం. నవంబర్‌‌లో తాను నిర్వహిస్తున్న టాలెంట్ షో ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్‌’ ఫైనల్ ఎపిసోడ్‌‌కు జడ్జిగా వ్యవహరిస్తున్న జాక్ మా రావాల్సి ఉంది. కానీ ఆ కార్యక్రమానికి ఆయన హాజరవ్వలేదు. అంతేగాక, ఆ షో వెబ్‌సైట్ నుంచి ఆయన ఫొటోలను తొలగించారని ప్రముఖ యూకే పత్రిక టెలిగ్రాఫ్ వెల్లడించింది. చైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తే వారిలో జాక్​ మా కూడా ఒకరిగా ఉన్నారు. జిన్‌‌పింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలను గతేడాది అక్టోబర్​లో షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా తీవ్రంగా విమర్శించారు. అలీబాబా గ్రూప్స్​పై విచారణ చేస్తున్న సందర్భంగా జాక్ మా చైనాలోనే ఉండాలని ప్రభుత్వం అప్పట్లో ఆదేశించినట్టు సమాచారం. అలాగే క్రిస్మస్​ సందర్భంగా యాంట్ గ్రూప్​నకు చెందిన అన్ని కార్యాకలాపాలను నిలిపివేయాలని బీజింగ్ ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. చైనాలో అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్న జాక్ మా అంతర్జాతీయంగా చేసిన సేవా కార్యక్రమాల వల్ల చైనాకు ప్రపంచవ్యాప్తంగా కాస్త మంచిపేరును తీసుకొచ్చింది.