అందుబాటులోకి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు

అందుబాటులోకి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు

తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. కరోనాతో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరిపోక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాంతో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటుచేస్తున్నట్లు మెగాస్టార్ ప్రకటించారు. ఆ విధంగానే వారంలోనే ఆక్సిజన్ బ్యాంక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్తి చేశారు. ఈ సేవల కోసం ప్రత్యేకంగా ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ పేరుతో ట్విట్టర్ అకౌంటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆక్సిజన్ బ్యాంకులను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంత‌రాయంగా ఆక్సిజ‌న్ పంపిణీ కొనసాగుతుంది. చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్లు ఆర్డ‌ర్ చేశాం. కాన్సంట్రేటర్లు అత్యవసరంగా ఎక్క‌డ అవ‌స‌రమో తెలుసుకొని ఆక్సిజ‌న్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్ని జిల్లాల‌కు.. అవ‌స‌రమున్న అన్నిచోట్ల‌కు పంపిణీ చేస్తాం. ఆక్సిజ‌న్ సిలిండర్లు ఎక్కడెక్కడికి ఏ టైంలో చేరుకుంటున్నాయి అనేది తెలుసుకోవడానికి టెక్నీషియ‌న్లు ట్రాకింగ్ ప‌రిక‌రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. అన్నిచోట్లా ఇది స‌ద్వినియోగం కావాల‌నే మా ప్ర‌య‌త్నం.  రామ్ చ‌ర‌ణ్ ఈ ఏర్పాట్ల‌న్నీ చూస్తున్నారు’ అని మెగాస్టార్ అన్నారు.