- మైనింగ్ శాఖ, విజిలెన్స్ నివేదికల ఆధారంగా దర్యాప్తు
- గత బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల అక్రమాలు
- అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం
- బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదుపై త్వరలోనే నిర్ణయం: సీఐడీ చీఫ్ చారుసిన్హా
- హెచ్‌సీఏ అక్రమాలపై సీపీ తరుణ్ జోషి నేతృత్వంలో మరో సిట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను సీఐడీ ఏర్పాటు చేసింది. మైనింగ్ శాఖ నుంచి సేకరించిన డాక్యుమెంట్లు, నివేదికల ఆధారంగా ఎంక్వైరీ చేయనున్నట్లు సీఐడీ చీఫ్ చారుసిన్హా సోమవారం వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2014 నుంచి మైనింగ్ లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మైనింగ్‌శాఖ అధికారులు ప్రాథమిక విచారణ అనంతరం అక్రమాలు జరిగినట్లు నిర్ధారించి, ఈమేరకు పూర్తిస్థాయి దర్యాప్తు కోసం నివేదికను సీఐడీకి అందించారు. ఈ నివేదిక ఇప్పటికే తమకు చేరినట్లు సీఐడీ డీజీ చారుసిన్హా తాజాగా ధ్రువీకరించారు.
ప్రాథమిక దర్యాప్తులో భారీ అక్రమాలు
మైనింగ్శాఖతో పాటు విజిలెన్స్ అండ్ఎన్ఫోర్స్మెంట్ఆధ్వర్యంలో జరిగిన ప్రాథమిక దర్యాప్తులో భారీ అక్రమాలు బయటపడ్డాయి. లీజు ప్రాంతానికి బయట అక్రమంగా మైనింగ్ చేయడం, రికార్డుల తారుమారు, ఫేక్ డాక్యుమెంట్లతో రవాణా, క్వాంటిటీని తక్కువ చేసి చూపించడం సహా విదేశాలకు గ్రానైట్ అక్రమ తరలింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లలో నష్టం వాటిల్లినట్లు తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేయనుంది. 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం అక్రమ మైనింగ్‌తోపాటు అనుమతి లేకుండా కార్యకలాపాలు నిర్వహించిన క్రషింగ్ యూనిట్లలో సీఐడీ అధికారులు సోదాలు చేయనున్నట్లు సమాచారం.
ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్‌జోషి నేతృత్వంలో హెచ్‌సీఏ సిట్
మరోవైపు హెచ్‌సీఏపై నమోదైన నాలుగు కేసుల దర్యాప్తుకు సంబంధించి ప్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి సహా మొత్తం ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఐడీ డీజీ చారుసిన్హా గత నెల 28న మెమో జారీ చేశారు. ఈ సిట్ బృందంలో సీఐడీ హెడ్‌క్వార్టర్స్ ఎస్పీ ఎన్ అశోక్‌కుమార్, అడిషనల్ ఎస్పీ ఎన్‌ఎస్ మోహన్‌రాజా, ఏసీపీ ఎస్ మోహన్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు జి గోపినాథ్, పి రాజశేఖర్ ఉన్నారు. సిట్ బృందంలోని సభ్యులంతా సిట్ చీఫ్ తరుణ్ జోషి ఎదుట రిపోర్ట్ చేయాలని చారుసిన్హా పేర్కొన్నారు. హెచ్‌సీఏపై నమోదైన నాలుగు కేసులు సిట్‌కు బదిలీ చేసినట్టు వెల్లడించారు. గతంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఉప్పల్ పీఎస్‌లో నమోదైన కేసులో హెచ్‌సీఏ, అధ్యక్ష కార్యదర్శులను సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
