- మైన్స్ శాఖ నివేదిక ఆధారంగా విచారణ
- నేడో, రేపో ఎఫ్ఐఆర్ నమోదు చేసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మైనింగ్ శాఖ నుంచి సేకరించిన డాక్యుమెంట్లు, ప్రభుత్వ నివేదికల ఆధారంగా త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు సీఐడీలోని ఒక కీలక అధికారి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వారం వ్యవధిలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి సోదాలు జరుగనున్నట్లు సమాచారం. 2014 నుంచి మైనింగ్‌లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా మైనింగ్‌శాఖ అధికారులు ఒక ప్రత్యేక నివేదికను రూపొందించారు.
ఈ వివరాలు శనివారం మైనింగ్‌శాఖ నుంచి సీఐడీకి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నందున వీలైనంత త్వరగా దర్యాప్తు వేగవంతం చేసేలా పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత మైనింగ్‌శాఖ నుంచి మరిన్ని వివరాలు తీసుకునే అవకాశం ఉంది. లీజు ప్రాంతానికి వెలుపల అక్రమంగా మైనింగ్ చేయడం, నకిలీ పత్రాలతో రవాణా చేయడం, మినరల్ క్వాంటిటీని తక్కువ చేసి చూపించడం, ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండికొట్టడం, రికార్డులను తారుమారు చేయడం.. వంటి పలు కీలక అంశాలపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేయనుంది.
