గద్వాల, వెలుగు: గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామ సమీపంలో నెట్టెంపాడు 101 ప్యాకేజీ కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను ఆదివారం గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. రోజురోజుకూ రిజర్వాయర్ కట్ట నిర్మాణం పూర్తవుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలంలో భారీ వర్షాలు కురిస్తే గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, రిజర్వాయర్ పనులు నిలిపివేయాలన్నారు. దీంతో నిర్మాణ సంస్థ, రైతుల మధ్య చిన్నపాటి గొడవ, తోపులాట జరిగింది.
గ్రామస్తులు మాట్లాడుతూ.. రెండు నెలల కింద పనులు ప్రారంభించే సమయంలో రైతులను అకారణంగా అరెస్టు చేశారన్నారు. ఆర్డీవో తమకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదన్నారు. ప్రధానంగా ఆర్అండ్ఆర్ సెంటర్ లో తమకు సౌలతులు కల్పించాలన్నారు.18 సంవత్సరాల కింద ఇండ్లకు ఇచ్చిన పరిహారంతో బాత్ రూంలు కూడా కట్టుకోలేమని వాపోయారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వట్టెం రిజర్వాయర్ పరిధిలోని రైతులకు ఇచ్చిన పరిహారాన్ని తమకు వర్తింపజేయాలన్నారు. ఈ విషయమై జిల్లా ఆఫీసర్లు స్పందించాలని కోరారు.

