హార్మూజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్..నౌకల రాకపోకలు బంద్

హార్మూజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్..నౌకల రాకపోకలు బంద్
  • అమెరికా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని విమర్శ
  • లెబనాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదని ఫైర్​
  • దాడులు కొనసాగిస్తే మరిన్ని చర్యలు తప్పవని హెచ్చరిక
  • చర్చల కోసం త్వరలో స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జేడీ వాన్స్

టెహ్రాన్: లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ నిరంతరాయంగా జరుపుతున్న దాడులు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ... వాణిజ్య నౌకల రాకపోకల కోసం హార్మూజ్ జలసంధిని ఇరాన్ సైన్యం మళ్లీ మూసివేసింది. ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌‌క్వార్టర్స్ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘అమెరికా కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి నిబంధనను స్పష్టంగా ఉల్లంఘించింది. అలాగే, దక్షిణ లెబనాన్‌‌లో ఇజ్రాయెల్ శక్తులు శాంతి ఒప్పందాన్ని తుంగలో తొక్కి సాగిస్తున్న మారణహోమం, అక్కడి ప్రజల వలసలు, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గకపోవడాన్ని నిరసిస్తూ హార్మూజ్‌‌ను మూసేస్తున్నాం’ అని ప్రకటించింది. ఇది మొదటి చర్యేనని, దాడులు కొనసాగితే మరిన్ని తీవ్ర చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.

చమురు సంక్షోభం -ఇజ్రాయెల్ మొండితనం

ప్రపంచ ఇంధన ఎగుమతుల్లో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే, ఇరాన్‌‌తో యుద్ధాన్ని ముగింపునకుతెస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలోనే ఒక మైలురాయి లాంటి ఒప్పందాన్ని ప్రకటించారు. యుద్ధం ముగియాలంటే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కానీ, ఈ శాంతి ఒప్పందంపై అసంతృప్తితో ఉన్న ఇజ్రాయెల్.. సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య శుక్రవారం ఒక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, శనివారం నాటి దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. సిడాన్ నగరం సమీపంలోని ఒక గ్రామంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు  చనిపోగా, నబాతియె ప్రాంతంలో జరిగిన దాడుల్లో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

త్వరలో స్విట్జర్లాండ్‌‌కు జేడీ వాన్స్!

ఇరాన్‌‌తో తదుపరి చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ త్వరలోనే స్విట్జర్లాండ్ వెళ్లనున్నట్లు తెలిపారు. టెహ్రాన్‌‌తో కుదిరిన 14 సూత్రాల ఒప్పందం ఖచ్చితంగా నిలబడుతుందని, హార్మూజ్ జలసంధి మూతపడినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజానికి శుక్రవారం జరగాల్సిన ఈ చర్చలు వాయిదా పడ్డాయి. ఆ చర్చలను మళ్లీ పట్టాలెక్కించడానికి అమెరికా రాయబా రి స్టీవ్ విట్‌‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు.