V6 News

అన్ని వాగులపై చెక్‌ డ్యాంలు కట్టాలె

అన్ని వాగులపై చెక్‌ డ్యాంలు కట్టాలె
  • ఈ  నెలలోనే టెండర్లు పిలవాలి…
  • ఏడాదిలో సగం పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌
  • నిర్మాణానికి అవసరమైన నిధులు బడ్జెట్‌లో ఇస్తాం
  • చెరువుల నిర్వహణకూ ఏటా ఫండ్స్
  • నీరటి వ్యవస్థను పునరుద్ధరించాలి
  • మైనర్‌ ఇరిగేషన్​పై సీఎం రివ్యూ

పంట చేన్ల నుంచి వచ్చే నీళ్లు, వాన నీళ్లు సహజంగా ఏర్పడిన వాగులు, వంకలు, డొంకల నుంచి కిందికి వెళ్లిపోతున్నాయి. వాటిని ఎక్కడికక్కడ నిలిపి ఉంచడానికి చెక్‌ డ్యామ్‌లు ఉపయోగపడుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని చెక్‌ డ్యామ్‌లు ఉన్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని అవసరమనే లెక్కలు తీసి, వాటిలో సగానికి వెంటనే టెండర్లు పిలవాలి. -సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని వాగులపై చెక్‌‌ డ్యాంల నిర్మాణానికి ఈనెల 15లోగా టెండర్లు పిలవాలని ఇరిగేషన్‌‌ అధికారులను సీఎం కేసీఆర్‌‌ ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌‌లో చెక్‌‌ డ్యాంల నిర్మాణంపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా వాగులపై ఎన్ని చెక్‌‌ డ్యాంలు అవసరమో గుర్తించాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన చెక్‌‌ డ్యాంలు, మొత్తం అవసరమైన చెక్‌‌ డ్యాముల్లో ఈ యేడాది సగం, వచ్చే యేడు మిగతా సగం నిర్మిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌‌లోనే కేటాయిస్తామని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ఎన్ని చెక్‌‌ డ్యాంలు ఉన్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని అవసరమనే లెక్కలు తీసి, వాటిలో సగం చెరువులకు టెండర్లు పిలవాలి” అని ఆదేశించారు.

చెరువు.. ఊరికి బతుకుదెరువు

మిషన్‌‌ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణ యేటా చేపట్టాలని సీఎం సూచించారు. చెరువు ఊరికి బతుకుదెరువని, పునరుద్ధరించిన చెరువు కట్టలు, తూములు, కాల్వలు మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలన్నారు. చెరువుల నిర్వహణకు అవసరమైన నిధులను బడ్జెట్‌‌లోనే కేటాయిస్తామని తెలిపారు. ఏటా ఎండాకాలంలో చెరువుల్లో పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లో పోసుకునేలా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ శాఖ, రైతు సమన్వయ సమితి, గ్రామ పంచాయతీలు సమన్వయంతో ఈ పని చేయాల్సి ఉంటుందన్నారు. చెరువులపై ‘‘నీరటి కాడు’’ వ్యవస్థను పునరుద్ధరించాలని, వీఆర్‌‌ఏల్లో ఒక్కరికి చెరువుల పనిని అప్పగించాలని ఆదేశించారు.

కాళేశ్వరం నుంచే 500 టీఎంసీల నీళ్లు

ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో సాగునీటి సమస్య తీరనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ లిఫ్ట్‌‌ స్కీములతో గోదావరి నుంచి రాష్ట్ర వాటాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే 500 టీఎంసీలకు పైగా నీటిని తీసుకుంటామని, ఎల్లంపల్లి, మిడ్‌‌ మానేరు, లోయర్‌‌ మానేరు, ఎస్సారెస్పీతోపాటు మల్లన్నసాగర్‌‌, కొండపోచమ్మసాగర్‌‌, బస్వాపూర్‌‌ తదితర రిజర్వాయర్లను నింపుతామని తెలిపారు. వీటి పరిధిలోని అన్ని చెరువులకు నీళ్లు అందిస్తామన్నారు. దీంతో రాష్ట్రం మొత్తం జలధారగా మారుతుందని, పంటలు పుష్కలంగా పండుతాయని అన్నారు.

పాలేరు నుంచి మిర్యాలగూడకు నీళ్లు

ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం నుంచి మిర్యాలగూడ డివిజన్‌‌లోని నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు సర్వే చేయాలని ఇరిగేషన్‌‌ అధికారులను సీఎం కేసీఆర్‌‌ ఆదేశించారు. మిర్యాలగూడ డివిజన్‌‌లోని ఆయకట్టుకు పూర్తిగా నీళ్లు అందడం లేదని, పాలేరు జలాశయం ఎగువన లిఫ్ట్‌‌ స్కీం నిర్మించి ఆ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ఉన్న పరిస్థితులపై స్టడీ చేయాలన్నారు. అర్హులందరికీ ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని సీఎం ప్రకటించారు.

అక్టోబర్‌‌ కల్లా రిజర్వాయర్లు నింపాలె

వానాకాలం ప్రారంభంలోనే కడెం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు ఎల్లంపల్లికి చేరే అవకాశం ఉన్నందున, వేసవిలోనే ఎల్లంపల్లి నీటిని ఎస్సారెస్పీకి తరలించాలని అధికారులకు సీఎం సూచించారు. పోచంపాడు ప్రాజెక్టు ఆయకట్టుకు ఎప్పుడూ నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను అక్టోబర్‌‌ నాటికి పూర్తి స్థాయిలో నింపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇరిగేషన్‌‌ వ్యవస్థను ఐదారుగురు ఈఎన్సీల పరిధిలోకి తీసుకురావాలని, ఇందుకు తగ్గట్టుగా డిపార్ట్‌‌మెంట్‌‌ను పునర్వ్యవస్థీకరించాలని అన్నారు. ఈఎన్సీలు తమ ప్రాంతంలోని అన్ని నీటి వనరులను పర్యవేక్షించాలని మేజర్‌‌, మీడియం, మైనర్‌‌ ఇరిగేషన్‌‌ అనే తేడా లేకుండా ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ మొత్తం ఒకే విభాగంగా పనిచేయాలన్నారు. రివ్యూలో మంత్రి గంగుల కమలాకర్‌‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌‌రెడ్డి, భానుప్రసాద్‌‌రావు, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌, ఈఎన్సీలు మురళీధర్‌‌, వెంకటేశ్వర్లు, కన్సల్టెంట్‌‌ విజయ్‌‌ప్రకాశ్‌‌, సీఈలు వీరయ్య, హమీద్‌‌ ఖాన్‌‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌‌ దేశ్‌‌పాండే తదితరులు పాల్గొన్నారు.

CM KCR directs officials to construct adequate Check Dams