ఐపీఎల్ 2026లో భాగంగా సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. చెపాక్ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్, చెన్నై నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 159 రన్స్ టార్గెట్ కోసం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు) ధాటిగా ఆడి 58 పరుగుల వద్ద నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు.
ఇక లోకల్ బాయ్ సాయి సుదర్శన్ చెపాక్ గ్రౌండ్‌లో క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గ్రౌండ్ నలుమూలల బౌండరీలు బాదుతూ అద్భుత హాఫ్ సెంచరీ చేసిన తర్వాత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్, సుదర్శన్‌కు తోడై వేగంగా పరుగులు రాబట్టాడు. కాగా, చివర్లో సాయి సుదర్శన్ ఔట్ అయినప్పటికీ, బట్లర్ మ్యాచ్ ని కంప్లీట్ చేశాడు. దీంతో మరో 16.4 ఓవర్లలోనే గుజరాత్ టైటాన్స్ లక్ష్యాన్ని ఛేదించింది.
చేతులెత్తేసిన చెన్నై బౌలర్లు
అంతకుముందు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74) ఒంటరి పోరాటం చేయడంతో సీఎస్‌కే 158 పరుగులు చేయగలిగింది. అయితే, ఈ స్కోరును కాపాడుకోవడంలో చెన్నై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. నూర్ అహ్మద్ మినహా మిగిలిన బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

