V6 News

కాంగ్రెస్​.. దుర్మార్గుల బ్రీడింగ్​ సెంటర్​: సీఎం

కాంగ్రెస్​.. దుర్మార్గుల బ్రీడింగ్​ సెంటర్​: సీఎం

రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​, బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్​ విరుచుకుపడ్డారు. దుర్మార్గుల బ్రీడింగ్​ సెంటర్​ కాంగ్రెస్​ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ‘‘అంతా మీరే(కాంగ్రెస్​వాళ్లు) చేసిండ్రు. మేము కాదంటున్నమా… మీ కాలంలో మంచిగా బ్రహ్మాండంగా మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కాల్పులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లినయ్​. ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ ఇప్పుడు లేవు కదా.. ఫ్యాక్షన్​ రాజకీయాలు తెచ్చింది కూడా ఈ ఘనులే. దేశంలో ఉన్న దుర్మార్గాల బ్రీడింగ్​ సెంటరే వీళ్లు” అని ఆదివారం అసెంబ్లీలో దుయ్యబట్టారు. ‘‘వీరి అసమర్థమైన అర్ధశతాబ్దపు పాలన వల్ల నక్సలిజం పుట్టుకొచ్చింది” అని అన్నారు. తాము చేసే ఒక్క మంచిపనిని కూడా ప్రతిపక్షం ప్రశంసించడం లేదని, మొన్న వీళ్లు ఓడిపోంగనే హిమాలయాలకు పోయి ఆకు పసరు తాగినట్టు  ఏందిది అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్​, బీజేపీ కుమ్మక్కవుతున్నయి

‘‘వీళ్లో(కాంగ్రెస్​) పార్టీ.. ఇంకో(బీజేపీ) పార్టీ బయట ఉంది.. ఆ పార్టీకి మెంబర్‌‌ ఒక్కడే ఉండే. ఆయన పత్తాలేడు ఎందుకో..? వీళ్లు మాట్లాడే మాటలు వింటే ఆగమాగం అయిపోవాలె. వీళ్లు మన రాష్ట్రానికి ఏడు సందమామలు.. ఆరు సూర్యుల్ని తెచ్చిపెడితే మేం కరాబ్​ చేస్తున్నమట” అని సీఎం విమర్శించారు.   అవసరమైన చోట ఇద్దరూ కుమ్మక్కవుతున్నారని, ఈ మధ్య ఇదో కొత్త విద్య నేర్చుకున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలపై ఆరోపణలు చేశారు.  ‘‘మొత్తం రాష్ట్రాలకున్న అధికారాలను హరించింది ఇదే కాంగ్రెస్‌‌ పార్టీ. కాంకరెంట్‌‌ లిస్ట్‌‌ అని పెట్టిన్రు. అది నథింగ్‌‌ బట్‌‌ సెంట్రల్‌‌ లిస్ట్‌‌.. అదో జోక్‌‌ అయిపోయింది. మరికొన్ని హక్కులు కబళించారు. వీరికన్నా ఎక్కువ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది.. కాంకరెంట్‌‌ లిస్ట్‌‌పై మాట్లాడే దమ్ము కాంగ్రెస్‌‌, బీజేపీలకు లేదు. జీఎస్టీ విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ప్రభుత్వమే కొట్లాడింది. మా పోరాటాలతోనే  5 శాతానికి పన్ను తగ్గింది” అని సీఎం కేసీఆర్​ అన్నారు.

భట్టి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుండు

‘‘ఎంపీగా ఉత్తమ్ గెలవడంతో హుజూర్‌‌నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా నామినేషన్లే స్టార్ట్ కాలేదు. అప్పుడే భట్టి విక్రమార్క ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండు. ఈ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని మీడియాతో అంటుండు. మా పాలన మీద ప్రజలకు నమ్మకముంది. ఆరేడు నెల్ల పదవీకాలాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు పోయిన చరిత్ర మాది” అని సీఎం తెలిపారు. తప్పిపోయి బీజేపీగిట్ల వస్తే..

‘బడా భాయ్​ బడా భాయ్​.. చోటే బాయ్‌‌ సుభాన్‌‌ అల్లా’ అన్నట్లుగా ఉంది బీజేపీ తీరు ఉందని సీఎం ఎద్దేవా చేశారు. ‘‘బీజేపీ వాళ్లు మేమే వస్తం అంటున్నరు. రానే వస్తిమి.. రేపే వస్తం. ఎల్లుండే వస్తం.. ఆవల ఎల్లుండే వస్తం అంటున్నరు. ఏం లేనోనికి ఏతులెక్కువ.., మతం పుచ్చుకున్నోనికి నామాలెక్కువ. బీజేపీ వస్తే మూడు చంద్రులను పెడుతరట. తప్పిపోయి బీజేపీగిట్ల అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ఆగమైతది.. ఆయుష్మాన్‌‌ భారత్‌‌ వస్తది. నోట్ల మన్ను పడ్తది. రైతుబంధు పోతది.. కిసాన్‌‌ సమ్మాన్‌‌ వస్తది. ఇయ్యాల ఒక ఎకరానికి పది వేలు ఇస్తున్నం. కిసాన్‌‌ సమ్మాన్‌‌ కింద ఏమొస్తది. రైతుకు ఆరు వేలు వస్తది. మొత్తం సంవత్సరానికి ఎన్ని ఎకరాలున్నా.. వచ్చేది ఆరు వేలే. ఎకరానికి 10 వేలు వచ్చే రైతుబంధు కావాల్న.. కిసాన్‌‌ సమ్మాన్‌‌ ఇచ్చి కిసకిసమని కొట్టుకోవాల్న” అని అన్నారు.  బీజేపీ వచ్చి ఉద్ధరించి కిరీటాలు పెడుతదట ఇక రైతులకు అని విమర్శించారు.  బీజేపీ మాటలు చెప్పడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ‘‘ఐటీఐఆర్‌‌కు రూపాయి ఇవ్వలేదు.  ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు” అని అన్నారు. తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానిస్తోందని, తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోడీ అంటున్నారని, ఆ మాటలను ఆయన బంద్‌‌ చేసుకోవాలని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన రోజు డార్క్‌‌ డే అని కేంద్ర హోం మంత్రి అమిత్‌‌షా అంటున్నారని, ఆ కామెంట్స్​ను వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు.

పేపర్లను టేబుల్​పై విసిరిన సీఎం

రాష్ట్రాన్ని 51 ఏండ్లు కాంగ్రెస్‌‌, 16 ఏండ్లు టీడీపీ పాలించాయని సీఎం చెప్తుండగా.. కాంగ్రెస్‌‌ సభ్యులు అప్పుడు మీరు టీడీపీలో ఉన్నరు అనడంతో సీఎం స్పందిస్తూ ‘‘నేను ఉన్న.. ఉన్న కాబట్టే జెండా ఎగరేసిన. నేను లేకపోతే అడిగేటోడు ఎవడు? ఇంకా మీ దుఖాణమే నడుసు. మీరు మాట్లాడితే బాధ కలుగుతది’’ అంటూ తన చేతిలోని పేపర్లను తన ముందు టేబుల్‌‌పై విసురుగా పడేశారు. ‘‘ఇప్పుడు నేనున్న స్థానంలోనే కిరణ్‌‌కుమార్‌‌ రెడ్డి ఉండి ఒక్క రూపాయి కూడా ఇవ్వ అన్న రోజు ఇదే భట్టి స్పీకర్‌‌గా, శ్రీధర్‌‌బాబు మంత్రిగా వర్ధిల్లిండ్రు.. మమ్ముల్నా వీళ్లు అనేది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Kcr Fire on Congress, Bjp leaders