- ఉమ్మడి జిల్లాలకు త్వరలో స్పెషల్ ఆఫీసర్లు
- సాదా బైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం
- తహసీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు
- జిల్లా కేంద్రాల్లో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు
- ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, ఇండ్ల నిర్మాణం మరింత వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తున్నట్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లా హౌసింగ్ పీడీలతో ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సోమవారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, హౌసింగ్ అధికారుల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ప్రతి నియోజకవర్గం నుంచి ఫోర్ వీలర్ వాహనం ఉన్న సుమారు 30 నుంచి 40 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు నిలిచిపోయాయని ఎమ్మెల్యేలు, ఎంపీలు పేర్కొన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఈ నిబంధన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదని, కేంద్ర ప్రభుత్వ పథకం అయిన పీఎం ఆవాస్ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సుమారు నాలుగు వేల కేసులు ఉన్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గతంలో దరఖాస్తు చేయని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా అర్హత ఉంటే వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని, లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకునేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. వివిధ కారణాలతో ఇళ్లు నిర్మించుకోలేని వారు తమకు ఇల్లు అవసరం లేదని తెలియజేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని సూచించారు. గత ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పూర్తి చేసి, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇండ్ల నిర్మాణానికి వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
భూ సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం
భూసర్వే ద్వారా భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాప్ ఆధారంగా రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నామని, రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సర్వే మ్యాప్ నంబర్, భూదార్ నంబర్ కేటాయిస్తున్నామని వివరించారు. సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. కొనుగోలుదారు ఒక్కడే డిక్లరేషన్ ఇచ్చినా సరిపోతుందని తెలిపారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయడానికి ఆర్డీవోలకు తుది అధికారాలు అప్పగించినట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా తహసీల్దార్ కార్యాలయాలను నిర్మించనున్నామని, తొలి దశలో శిథిలావస్థకు చేరిన కార్యాలయాలను పునర్నిర్మిస్తామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించనున్నట్లు చెప్పారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్దాలుగా రెవెన్యూ, ఫారెస్ట్, ఎండోమెంట్, వక్ఫ్ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయని, ఉమ్మడి సర్వే నిర్వహించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. రెండో దశలో ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. మొదటి దశ లబ్ధిదారుల బిల్లులు ఆగిన చోట సమస్యలను పరిష్కరించి వెంటనే విడుదల చేయాలని అన్నారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పనుల పర్యవేక్షణను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు సురేష్ షెట్కార్, గడ్డం వంశీకృష్ణ, నగేష్, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, పాయల శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీశ్ బాబు, కాటేపల్లి వెంకట్రామ్ రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ. గౌతమ్, కలెక్టర్లు పాల్గొన్నారు.

