కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ రెండో దశ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా చూసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను రంగంలోకి దించింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది.
రెండో దశ పోలింగ్‌కు ముందు ఏప్రిల్ 26న పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త రఫికుల్ ఇస్లాం ఇంట్లో 79 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఓటింగ్‌కు అంతరాయం కలిగించడానికి, రాజకీయ పార్టీల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడానికి దుండగులు బాంబులను ఉపయోగించకుండా చూసేందుకు ఈసీ ఎన్ఐఏను రంగంలోకి దించింది.
ఇప్పటికే రెండో దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు బెంగాల్ సెకండ్ ఫేజ్ ఎన్నికల అబ్జర్వర్‌గా యూపీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మను ఈసీ అపాయింట్ చేసింది. ఇదిలా ఉండగా.. తాజాతా జాతీయ దర్యాప్తు సంస్థను ఈసీ రంగంలోకి దించడం చర్చనీయాంశంగా మారింది.
బెంగాల్లో లో విస్తృత భద్రతా ఏర్పాట్లు
ఏప్రిల్ 29న జరగనున్న రెండో దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ఏడు జిల్లాల్లో 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. మరోవైపు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను నియమించారు. రాజధాని కోల్కతాలో అత్యధికంగా 273 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.

