V6 News

ఎన్నికల తర్వాత పెట్రోల్, డిజిల్ ధరలు పెంచం: కేంద్రం క్లారిటీ

ఎన్నికల తర్వాత పెట్రోల్, డిజిల్ ధరలు పెంచం: కేంద్రం క్లారిటీ

న్యూఢిల్లీ: కేరళ, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుతాయంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రణాళికలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మంగళవారం (ఏప్రిల్ 28) మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో ఇంధనం ధరల పెంపు ప్రచారాన్ని ఖండించారు.

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంధన ధరలు పెరగబోతున్నాయనే భయంతో కొన్నిరాష్ట్రాల్లో ప్యానిక్ బయింగ్ జరగడంతో ఇంధన కొరత ఏర్పడిందని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 

కొనుగోళ్లు పెరిగిన బంకులకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇస్తున్నామని.. తద్వారా స్టాక్ లభ్యత ఉండేలా కొరత ఏర్పడకుండా చూస్తున్నామని తెలిపారు. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ఎల్‌పీజి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వంటి అన్ని ఇంధనాల నిల్వలు తగినంతగా ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. దయచేసి ఎవరూ వదంతులను నమ్మవద్దని.. ప్యానిక్ బయింగ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. 

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ముడి చమురు కోసం ఇండియా ఎక్కువగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడటంతో దేశంలో కూడా ఇంధన కొరత నెలకొంది. హార్మూజ్ జలసంధి మూసివేతతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. 

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర సెంచరీ మార్క్ క్రాస్ చేసింది. ఈ ప్రభావం దేశీయ ఆయిల్ కంపెనీలపై తీవ్రంగా పడింది. ముడిసరుకుల ఖర్చులకు, పంపు ధరలకు మధ్య పెరుగుతున్న అంతరం కారణంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఆయిల్ కంపెనీల రోజువారీ నష్టం సుమారు రూ. 2,400 కోట్లుగా ఉంది. 

దీంతో ఇంధన ధరలు పెంచాలని ఆయిల్ కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల వేళ పెట్రోల్, డిజిల్ ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేక వస్తుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంభించింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం పెట్రోల్, డిజిల్ ధరల పెంపుకు సిద్ధమైందని జోరుగా ప్రచారం జరుగుతోంది.