గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలు ఇప్పట్లో లేనట్లే!

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలు ఇప్పట్లో లేనట్లే!

హైదరాబాద్, వెలుగు : గవర్నర్​ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి సీఎం కేసీఆర్​వెనుకడుగు వేస్తున్నారు. రెండు సీట్లకు రెండు డజన్ల మందికిపైగా నేతలు పోటీ పడుతుండటంతో వారిలో ఎవరికి చాన్స్​ఇచ్చినా మిగతా వాళ్లు చేజారుతారేమోనని సీఎం హైరానా పడుతున్నారు. మే 27న గవర్నర్​ కోటాలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. మార్చి ఏడో తేదీన ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు బీఆర్ఎస్​ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. మార్చి నెలలోనే 9న నిర్వహించే కేబినెట్​సమావేశంలో గవర్నర్​కోటాలో నామినేట్​చేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి సమావేశం తర్వాత వారి పేర్లు ప్రకటిస్తామని సీఎంవోతో పాటు బీఆర్ఎస్​పార్టీ అధికారికంగా ప్రకటించింది.

మార్చి 9న కేబినెట్​భేటీ జరిగినా గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలు ఎవరో తేల్చలేదు. మే 27 వరకు గడువుండడంతో ఈ అంశంపై సమావేశంలో చర్చించలేదని కేబినెట్​ భేటీ అనంతరం మంత్రులు తెలిపారు. మే 18న కొత్త సెక్రటేరియెట్ లో  కేబినెట్​ సమావేశమైంది. ఈ భేటీలోనూ గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటి చర్చ జరగలేదని మంత్రులు తెలిపారు. ఈ ఎన్నికలపై కేసీఆర్​ అప్పటికే నిర్ణయం తీసుకున్నారని, గవర్నర్​కు పంపే నోట్​ఫైల్ ​కూడా రెడీ అయిందని మంత్రులు పేర్కొన్నారు. సర్క్యులేషన్​ పద్ధతిలో కేబినెట్​ ఆమోదం తీసుకొని గవర్నర్​ ఆమోదం కోసం పంపడమే తరువాయి అని చెప్పారు. ఇది జరిగి నెల రోజులు కావొస్తున్నా గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చడీచప్పుడు లేదు.

సీఎం, మంత్రులకు ఆ నేతల వినతి

గవర్నర్​ కోటాలో మండలికి ప్రాతినిధ్యం వహించిన రాజేశ్వర్​రావు,  ఫారూఖ్​ హుస్సేన్​ పదవీకాలం మే 27న ముగిసింది. ఆ రెండు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేస్తామని సీఎంవో, బీఆర్ఎస్​ పార్టీ మార్చి 7వ తేదీనే అధికారికంగా ప్రకటించాయి. ఆ తర్వాత రెండుసార్లు కేబినెట్​ భేటీ అయ్యింది. గవర్నర్​ కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలు మైనారిటీ వర్గాలకు చెందినవే. క్రిస్టియన్, ముస్లిం నేతలు ఖాళీచేసిన ఆ రెండు సీట్లను ఆయా వర్గాలకే కేటాయించాలనే డిమాండ్​ ఉంది. తమకు చాన్స్​ఇవ్వాలని ఆ రెండు వర్గాలకు చెందిన పలువురు నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్​ను కలిసి విన్నవించారు. ఈ ఏడాది నవంబర్​లోపే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో రాజకీయ అవసరాల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రగతి భవన్​ నుంచి లీకులు ఇచ్చారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, దాసోజు శ్రవణ్, ఘంటా చక్రపాణి, విద్యా స్రవంతి, పీఎల్​ శ్రీనివాస్, స్వామిగౌడ్, బూడిద భిక్షమయ్య గౌడ్​ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం చేశారు. వీరే కాకుండా ఇంకో 20 మంది నాయకులు తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. రెండు సీట్లకు లీడర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉండటం, వారిలో ఎవరికి అవకాశం ఇచ్చినా మిగతా వాళ్లు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉండడంతో ఈ రెండు పోస్టుల భర్తీకి ప్రస్తుతానికి బ్రేక్​పడిందని బీఆర్ఎస్ లో ప్రచారం జరుగుతున్నది.