హైదరాబాద్, వెలుగు:
సమాజంలో నేరప్రవృత్తి పెరగకుండా, నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని.. అందుకే వచ్చే ఏడాది నుంచి నైతిక విలువలు పెంచేలా పాఠాలను ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్ తెలిపారు. మంచి సమాజాన్ని నిర్మించే క్రమంలో చినజీయర్ స్వామి వంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామన్నారు. మాజీ డీజీపీ హెచ్‌జే దొర రాసిన ఆటో బయోగ్రఫీ ‘జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. దొరను, ప్రచురణకర్తలను సన్మానించి మాట్లాడారు. హెచ్‌జే దొర తన సర్వీస్ కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ, ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా పుస్తకం రాశారని కేసీఆర్ ప్రశంసించారు. దురదృష్టవశాత్తు సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోందని, కొన్నిచోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాటిని నియంత్రించాలని.. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుందని.. జనం మనోభావాలను గుర్తించి కొన్ని పనులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. సమాజానికి మంచి జరుగుతుందనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదన్నారు. ఇక దళితులను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంకల్పానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలో మనం ఏ ఊరికి వెళ్లి వెతికినా దళితులే పేదలుగా కనిపిస్తున్నారని, ఆ పరిస్థితి పోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులను విద్యావంతులను చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో కష్టపడుతున్నారని ప్రశంసించారు.
శాంతియుతంగా ఉంటేనే సాధ్యం
కేసీఆర్ ఎంచుకున్న శాంతియుత పంథాతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు అన్నారు. 1969 ఉద్యమం హింసాత్మకం కావడం వల్లనే విజయవంతం కాలేదని, 2001లో మొదలైన ఉద్యమం నిలబడి, విజయం సాధించడం అహింసామార్గం వల్లే సాధ్యమైందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ ఉన్నతాధికారులు కాకి మాధవరావు, రొడ్డం ప్రభాకర్ రావు, విజయరామారావు, పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.
టీజీవో డైరీ ఆవిష్కరణ
ప్రగతిభవన్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల డైరీ, క్యాలెండర్‌ను సీఎం కేసీఆర్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీజీవో అసోసియేషన్ అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ పాల్గొన్నారు.


