జీతాలు ఇవ్వాలంటే బస్టాండ్లు అమ్మాలి : కేసీఆర్

జీతాలు ఇవ్వాలంటే బస్టాండ్లు అమ్మాలి : కేసీఆర్

హైదరాబాద్ :  పండుగ సమయంలో RTC కార్మికులు సమ్మె చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు సీఎం కేసీఆర్. గురువారం ఆర్టీసీ సమ్మెపై మాట్లాడిన ఆయన.. ఐఏఎస్ లు చెప్పినా కాదని సమ్మెకు పోతారా అన్నారు. యూనియన్ల లీడర్లు అద్దె బస్సులను తొలగించండి..అంటే ఆర్టీసీని నిండా ముంచాలనా అన్నారు. డ్యూటీ సమయంలో ట్రాఫిక్, ప్రయాణికులు ఎక్కేదగ్గర..దిగే దగ్గర కాస్త లేటే అవుతుందని.. దానికి ఎక్కువ సమయం శ్రమిస్తున్నామంటే ఎలా అన్నారు. ఓ గంట ఎక్కువ పని చేస్తే పోయిందేమిలేదన్నారు. అలా అనుకుంటే రైతు వ్యవసాయం చేయగలడా అని ఆర్టీసీ కార్మికులనుద్దేశించి మాట్లాడారు సీఎం.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి ఇప్పటికే రూ. 4,250 కోట్లు ఇచ్చామని తెలిపారు. బడ్జెట్ లోనూ ఎక్కువ రూపాయలు కేటాయిస్తున్నాం.. అయినా ఆర్టీసీ బస్సులతో రోజూ రూ.3కోట్ల నష్టం వస్తుందన్నారు. ఆర్టీసీ దగ్గర రూపాయిలేని పరిస్థితి అన్న కేసీఆర్..యూనియన్లు చేస్తున్న పని మహా నేరమన్నారు. ఆర్టీసీని ప్రపంచంలో ఎవ్వడూ కాపాడలేడని తెలిపారు. ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవ్వడూ కాపాడలేరన్న సీఎం.. ప్రస్తుతం కార్మికులకు  జీతాలు ఇవ్వాలంటే బస్టాండ్లు అమ్మే పరిస్థితిలో ఆర్టీసీ ఉందన్నారు.

డబ్బులు లేవంటే హైకోర్టు మమ్మల్ని కొడుతుందా.. ఆస్తులుంటే అమ్మి కార్మికులకు జీతాలివ్వాలని సంస్థకు సూచిస్తుంది అన్నారు కేసీఆర్. ప్రస్తుతం రూపాయిలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉంది. కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే ఓ నాలుగు బస్టాండ్లు అమ్మి ఇవ్వాలని  చెబుతుందన్నారు సీఎం కేసీఆర్. దసరా పండుగ సమయంలో కార్మికులు సమ్మె చేయడంతో రోజుకు కోటి రూపాయలు నష్టం వచ్చిందన్న సీఎం.. పాత ఆర్టీసీని బతికి బట్టకట్టకుండా ఈ యూనియన్లే చేశాయన్నారు.

అర్థంపర్ధం, బుద్ధిలేని సమ్మె కార్మికులు చేస్తున్నారన్న కేసీఆర్.. సమ్మె చట్టవ్యతిరేకమని.. ఆల్రెడీ ఎస్మా ఉందన్నారు. గొంతెమ్మ కోరికలతో, ఆర్టీసీని ఆగం చేసింది యూనియన్లేనని తేల్చి చెప్పారు సీఎం. యూనియన్లు లేకుంటే ఆర్టీసీలోనూ భవిష్యత్తులో రూ.లక్ష బోనస్ తీసుకునేవారన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇక వెయ్యిశాతం పాత ఆర్టీసీ ఉండదన్నారు సీఎం కేసీఆర్.  ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు అన్నారు.