పాత లెక్కనే కొత్త బడ్జెట్​!

పాత లెక్కనే కొత్త బడ్జెట్​!
  • ఓటాన్​ అకౌంట్​ రూ.1.82 లక్షల కోట్లు
  • ఇప్పుడూ అంతకే పరిమితమయ్యే చాన్స్‌
  • తుది దశకు కసరత్తు.. అమల్లో ఉన్న స్కీంలకే నిధులు
  • దాదాపు రూ.3 లక్షల కోట్లతో శాఖల ప్రతిపాదనలు
  • ఆర్థిక మాంద్యం ఉందని అంతకంతకు కుదింపు

బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరింది. ఇంచుమించుగా ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్ కు  దగ్గరగానే ప్రభుత్వం ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్​ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్​ను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం  ఆదేశించటంతో  బడ్జెట్ ను వీలైనంత కట్టడి చేయాలని  ఆర్థిక శాఖ భావిస్తోంది. ఫిబ్రవరి 22న  రాష్ట్ర ప్రభుత్వం రూ.1.82 లక్షల కోట్లతో  ఓటాన్​ అకౌంట్ బడ్జెట్​ను ప్రవేశపెట్టింది.  బడ్జెట్​లో కేటాయించిన మేరకు వివిధ పథకాలకు నిధులను సర్దుబాటు చేసింది. అందుకే  కొత్త పథకాల జోలికి వెళ్లకుండా.. వివిధ విభాగాల నుంచి వచ్చిన  ప్రతిపాదనలకు వీలైనంత కత్తెర వేయాలని డిసైడయింది. ఈసారి బడ్జెట్​లో పెద్దగా మార్పులు చేర్పులుండే అవకాశం లేదని ..  ఇంచుమించు ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్‌ మాదిరే ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ప్రకారం  ప్రభుత్వం ఆశించిన మేరకు రెవెన్యూ రాబడులు లేకపోగా.. ఆర్థిక మాంద్యంతో ఆదాయ వృద్ధి తగ్గుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు   కేంద్రం నుంచి  రాష్ట్రానికి వస్తాయనుకున్న నిధుల్లో దాదాపు రూ.10 వేల కోట్లకు కోత పడింది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఈ విషయం తేటతెల్లమైంది. అందుకే రాష్ట్ర బడ్జెట్​ఇంచుమించుగా పాత పద్దునే ప్రతిబింబించే అవకాశాలున్నాయి. ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు దాదాపు రూ.15 వేల కోట్ల మేరకు బిల్లులు బకాయిలు పడింది. మరోవైపు వివిధ విభాగాల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు దాదాపు రూ. 3 లక్షల కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్​ తయారీ అధికారులకు సైతం కత్తి మీద సాముల మారింది.

20 రోజులుగా కసరత్తు

ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్ గడువు  సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తుంది.  అందుకే  పూర్తి స్థాయి బడ్జెట్ తయారీకి  ఆర్థిక శాఖ ఇరవై రోజులుగా  కసరత్తు చేస్తోంది.  అన్ని విభాగాల నుంచి ఆగస్టు మొదటి వారంలో  ప్రతిపాదనలను స్వీకరించింది.  సెక్రెటేరియట్​ షిప్టింగ్​ ఎఫెక్ట్​తో ప్రతిపాదనల ప్రక్రియ దాదాపు పది రోజులు ఆలస్యమైంది. ఈసారి బడ్జెట్ కసరత్తు బాధ్యతను సీఎం  రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ వినోద్​కుమార్​కు అప్పగించారు.   రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ చేశారు.  ఈ సందర్భంగా వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదలను ఆర్థిక శాఖ సీఎం ముందుంచింది. వీటి ఆధారంగా  ఏ శాఖకు ఎంత మేరకు నిధులు కేటాయించాలనే చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మాంద్యం దృష్టిలో పెట్టుకోవాలని  సీఎం ఆదేశించటంతో.. ఈసారి బడ్జెట్​లో చెప్పుకోదగ్గ మార్పులుండవనే సంకేతాలు వెలువడ్డాయి.  ఇప్పటికే అమలవుతున్న  రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ల పెంపునకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించింది.  ఓటాన్​ అకౌంట్​బడ్జెట్​లో కేటాయింపులు చేసిన  నిరుద్యోగ భృతి,రైతు రుణమాఫీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. వీటికి తోడు బడ్జెట్​ పై ప్రభావం చూపే ఉద్యోగుల పీఆర్​సీ అమలు కూడా ప్రశ్నార్థకంగా మారింది.  ఆర్థిక మాంద్యం కారణంగా వీటిని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు దగ్గరగా..

వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని సీఎం చెప్పడంతో బడ్జెట్ కేటాయింపులు రియలిస్టిక్ గా ఉంటాయని ఆర్థికశాఖ వర్గాలు చెపుతున్నాయి. ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ రూ.1లక్ష 82 వేల 17 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా దాదాపుగా అంతే ఉండొచ్చని చెపుతున్నారు. ఎక్కువ కేటాయింపులు చూపించి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలన్న భావనలో సీఎం ఉన్నారని అంటున్నారు. ఎక్కువ కేటాయించి అసలు ఖర్చు చేయక పోవడం వల్ల విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని భావనలో సీఎం ఉన్నట్టు చెపుతున్నారు.

హామీల పరిస్థితి ఏంటీ?

ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ లో రుణమాఫీ కోసం రూ. 6000 కోట్లు కేటాయించారు. కాని ఇంత వరకు రుణమాపీ ఎప్పట్నించి అమలు చేస్తారు. దాని విధి విధానాలు ఎంటో ఇంతవరకు ఖరారు చేయలేదు. 2018 డిసెంబర్ 1  కటాఫ్​ డేట్​గా  పెట్టుకుని రుణమాపీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు. నాలుగు విడతలుగా రుణమాఫీని అమలు చేస్తామని అన్నారు. మొదటి విడత  ఈ ఏడాది చివరి నాటికి ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. పిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కోసం రూ.1810 కోట్లు కేటాయించారు.  అసలు నిరుద్యోగులు ఎవరు? ఏ వయస్సువారికి భృతిని ఇస్తారని విధి విధానాలు ఖరారు చేయలేదు. ప్రభుత్వం అంచనాల మేరకు డిగ్రీ విద్యార్హత ఉండి 35 ఏళ్ల వయస్సుకు లోపు ఉన్న వారు  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఉంటారని తేలింది.  ఇందులో ఎంత మంది అసలు ఉద్యోగం లేకుండా ఉన్నారని ఎలా తేల్చాలో  అంతు పట్టడం లేదని అంటున్నారు. ఆర్థిక శాఖ సీఎం వద్దే ఉంటడంతో ఈసారి సీఎం కేసీఆరే బడ్జెట్ ప్రవేశ పెడతారు.

పెద్ద ఎత్తున ప్రతిపాదనలు

వివిధ శాఖలు ఎప్పటి మాదిరే ఈసారి కూడా పెద్ద ఎత్తున ప్రతిపాదనలు పంపాయని ఆర్ధికశాఖ వర్గాలు చెపుతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఆ శాఖల అవసరాలు వివరిస్తూ ప్రతిపాదనలు పంపారు. వివిధ శాఖలు పంపిన ప్రతిపాదనలు అన్ని కలిపితే సుమారు 3 లక్షల కోట్లు ఉంటుందని చెపుతున్నారు. అయితే బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ కు దగ్గరగా ఉంటుందని అంటున్నారు. ఇరిగేషన్ శాఖలో దాదాపు రూ.10 వేల కోట్ల పెండింగ్​ బిల్లులున్నాయి. దీంతో ఈసారి రూ.30వేల కోట్ల ప్రతిపాదనలు పంపిందని తెలిసింది.  విద్యాశాఖ ఈసారి తన ప్రతిపాదనలను భారీగా పెరిగాయి.  విద్యాశాఖలో కొత్తగా టీచర్ల నియామకం జరగడంతో   బడ్జెట్ ప్రతిపాదనలు పెరిగాయి. విద్య,క్రీడలు,కళ,సంసృతి రంగాల నుంచి సుమారు రూ. 7 వేల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి. ఆరోగ్యశాఖ నుంచి సుమారు రూ. 3 వేల కోట్ల ప్రతిపాదనలు అందాయి. విద్యుత్ శాఖ సుమారు రూ.11 వేల కోట్ల ప్రతిపాదనలు పంపింది. వైద్య శాఖ రూ.5 వేల కోట్ల ప్రతిపాదనలు పంపించింది. వ్యవసాయ శాఖ రూ.23 వేల కోట్ల ప్రతిపాదనలను
సమర్పించింది.