విద్యా, వైద్య రంగంపై రేపు కేసీఆర్ కీలక రివ్యూ

విద్యా, వైద్య రంగంపై రేపు కేసీఆర్ కీలక రివ్యూ

విద్యా, వైద్య రంగంపై సోమవారం మంత్రులు, అధికారులతో కీలక భేటీ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాక్సిన్ పంపిణీ, సరఫరాపై కలెక్టర్లకు సూచనలు చేయనున్నారు. కరోనాతో మూతపడ్డ స్కూళ్లు, కాలేజీల్లో క్లాసుల ప్రారంభంపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెవెన్యూ, పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారంపై రివ్యూ చేయనున్నారు. ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి రాష్ట్ర మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఇప్పటికే రెవెన్యూకు సంబంధించి సీనియర్ అధికారులు, కలెక్టర్లతో చర్చించిన సీఎం… అన్ని అంశాలను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన కార్యచరణను నిర్ణయించనున్నారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదాబైనమాల క్రమబద్దీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు తదితర విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్లతో చర్చించనున్నారు సీఎం. 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనుండడంతో…. వ్యాక్సిన్ సరఫరా, పంపిణీ విధానంపై కార్యాచరణ ప్రకటించనున్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుతీరును కేసీఆర్ సమీక్షించనున్నారు. గ్రామాలకు పట్టణాలకు నిధులు, వాటి వినియోగం అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల పరోగతిని సీఎం తెలుసుకోనున్నారు. పచ్చదనం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనాతో గతేడాది మార్చ్ నుంచి విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ క్లాసులకు అనుమతించినా… అవి అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏ తరగతులకు క్లాసులు నిర్వహించాలి.. నిబంధనలు ఎలా పాటించాలి… ఇతర రాష్ట్రాల్లో ఇందుకు అనుసరిస్తున్న విధానాలపై సీఎం చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.