మత పిచ్చిగాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలి

మత పిచ్చిగాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలి

ఎక్కడ స్త్రీలు పూజించబడుతారో.. అక్కడ దేవతలు సంచరిస్తుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఆయన.. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

‘తెలంగాణలో పేదింటి ఆడబిడ్డలను కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చాం. 2001 తర్వాత నేను పిడికెడు మందితో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పాలమూరు కరువును చూసి కంటతడి పెట్టుకున్నాను. తిట్టినా, చంపుతమని బెదిరించినా భయపడలేదు. మీ దీవెనలతో ముందుకెళ్లాను.. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఉద్యమ జెండా పరిపాలనలో ఉండాలని మీరు రెండుసార్లు అధికారమిచ్చారు. తెలంగాణ రాకముందు మహబూబ్‎నగర్‎లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. కానీ ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలొచ్చాయి. తెలంగాణ వచ్చాక మహబూబ్‎నగర్ వజ్రపు తునకలా తయారైంది. గతంలో నేను ఓ పాట రాశాను. వలసలతో విలవిల విలపించిన కరువు జిల్లా.. పెండింగ్ ప్రాజెక్ట్ లనే వడివడిగా పూర్తిచేసి.. చెరువలన్ని నింపి.. పన్నీటి జళకమాడి.. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది. గొప్ప గ్రామాల కోసం కేంద్రం లెక్కలు తీస్తే.. 10లో 7 గ్రామాలు తెలంగాణవే ఎంపికయ్యాయి. గతంలో కరెంట్ వస్తే వార్త.. కానీ ఇప్పుడు కరెంట్ పోతే వార్త. 

దేశంలో దేశంలో గోల్‎మాల్ గోవిందంగాళ్లు మోపయ్యారు. దేశాన్ని ఆగంబట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలకు మతపిచ్చి, కులపిచ్చి లేపాలని చూస్తున్నరు. రాజకీయాలు మంటకలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ బిడ్డగా.. నా కంఠంలో ప్రాణం ఉండగా.. అటువంటి అరాచకాలు తెలంగాణలో రానియ్యను. ఆ పోరాటానికి మనందరం సిద్ధంగా ఉండాలి. కుల, జాతి, మత తేడాల్లేకుండా ప్రజలంతా బాగుపడాలి.  దేశం బాగుపడితే మనం ఇంకా బాగుపడతాం. కాబట్టి మనం దేశం కోసం కూడా పోరాటం చేయాలి. తెలంగాణ కోసం ఎలా అయితే కొట్లాడినమో.. దేశం కోసం కూడా అలాగే పోరాటం చేయాలి. కులం, మతం అనేది దరిద్రమైనది. బుద్ధి తక్కువ పార్టీలు, బుద్ధి తక్కువ వెధవలు.. చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని, భారత జాతిని బలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ మేధావులు దాన్ని తిప్పికొట్టాలి. ఎన్నో పనులు ఎవరు అడకున్నా.. ఎవరు దరఖాస్తు పెట్టకున్నా చేసుకున్నాం. నిరుద్యోగ సోదరుల కోసం రేపు పొద్దున అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నాను. రేపు ఉదయం 10 గంటలకు అందరూ టీవీలు చూడండి. ఆ ప్రకటన ఎలా ఉంటుందో రేపు చూడండి. తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఎప్పటికీ పనిచేస్తది. గిరిజనుల రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే.. ఆ తీర్మానాన్ని ప్రధాని మోడీ కిందపెట్టుకొని కూర్చున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజల డిమాండ్లు, ఆవేశం, అవగాహన తెలియదు. మూర్ఖమైన మొండి పద్ధతిలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. పనికిమాలిన మత పిచ్చిగాళ్లను కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయాలి. అలా అయితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం మరింత ముందుకు పోవాలంటే.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాను, భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలి. అందుకోసం అందరం పోరాటం చేసి.. ఎక్కడివాళ్లను అక్కడే నిలదీయాలి. భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ నన్ను వెళ్లమని దీవిస్తున్నారు కాబట్టి దేశ రాజకీయాలను కూడా చైతన్యపరిచి.. ఎవడు ఎన్ని కష్టాలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా మడమ వెనుకకు తిప్పకుండా ముందుకు సాగి.. బంగారు తెలంగాణలాగా.. బంగారు భారతదేశాన్ని కూడా తయారుచేద్దాం’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.