- 22ఏలో ఉన్న ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపొద్దు
- స్లాట్ బుక్ చేసుకున్న 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి
- అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు
- 22ఏ జాబితా ప్రక్షాళన బాధ్యత కలెక్టర్లదే
- అబద్ధాలు, పుకార్లను నమ్మవద్దని ప్రజలకు పిలుపు
- ప్రైవేటు ఆస్తులకు ఇబ్బంది రానివ్వమని క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: 22-ఏ నిషేధిత భూముల జాబి తాలో ఉన్న ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్లాట్ బుక్ చేసుకున్న భూమి ప్రైవేటుదని తేలితే కేవలం 2 రోజుల్లోనే పరిశీలన పూర్తిచేసి, వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించాలని సూచించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని, ప్రైవేటు భూ యజమానులకు ఒక్క అంగుళం మేర కూడా ఇబ్బంది రానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిషేధిత భూముల వ్యవహారంపై సుదీ ర్ఘంగా చర్చించారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే.. క్షేత్రస్థాయి పరిశీలనను రెవెన్యూ అధికారులు వేగవంతం చేయాలని సూచించారు. సదరు భూమి ప్రైవేటుదిగా నిర్ధారణ అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా 48 గంటల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. మరోవైపు 22-ఏ జాబితా ప్రక్షాళన పూర్తి బాధ్యతను జిల్లా కలెక్టర్లకే అప్పగిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. నిషేధిత భూముల జాబితాను క్షుణ్ణంగా పునఃపరిశీలించి, ఎలాంటి తప్పులు లేని పక్కా జాబితాను రూపొందించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ భూముల వ్యవహారంలో ప్రజలెవరూ దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని పిలుపునిచ్చారు.
