- డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉన్నంత మాత్రాన ఓటు ఉన్నట్టు కాదు
- ఈ లిస్ట్‌లోనే 92.36 లక్షల అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు
- మొత్తం ఓటర్లలో మూడో వంతు మంది ఏదో ఒక వివరణ ఇవ్వాల్సిందే
- బీఎల్‌వోలు ఇంటికి వచ్చి ఇచ్చే నోటీసులకు స్పందించాల్సిందే
- రిప్లై ఇవ్వకపోయినా, అడిగిన పత్రాలు ఇవ్వకున్నా ఓటు ఔటే!
- ఓటర్ సర్వీస్ వెబ్‌సైట్‌లో
- ఎపిక్ సెర్చ్ చేసి నోటీస్ కేటగిరీ వివరాలు తెలుసుకోవచ్చు
- ఆయా లిస్టుల్లో ఉంటే ఆధారాలు రెడీగా ఉంచుకోవాలంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో భాగంగా సోమవారం ప్రకటించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరు ఉన్నంత మాత్రాన ఓటు భద్రంగా ఉన్నట్లు కాదు. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓటు కోల్పోయే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. డ్రాఫ్ట్ లిస్టులో మొత్తం 2 కోట్ల 64 లక్షల 87 వేల213 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా 92.36 లక్షల మంది ఓటర్లు నోటీస్ కేటగిరీలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఓటర్లలో దాదాపు మూడో వంతు మంది ఏదో ఒక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే డ్రాఫ్ట్లిస్ట్లోకి రాకుండా తొలగించిన 73.39 లక్షల ఓటర్లకు వీరు అదనం. సాంకేతిక లోపాలు, వ్యక్తిగత వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ‘అనామలీస్’లో 60.50 లక్షల మంది, 2002 ఓటర్ల వివరాలతో మ్యాపింగ్ జరగని ‘నో మ్యాపింగ్’ కేటగిరీలో 31.86 లక్షల మంది ఉన్నారు. ఈ ఓటర్లకు తాజాగా ఎన్నికల అధికారులు గురిపెట్టారు. ఈ రెండు కేటగిరీల కింద గుర్తించిన ఓటర్లందరికీ బీఎల్‌వోల ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. నోటీస్ అందుకున్న ఓటర్లు నిర్దేశిత గడువులోగా స్పందించి.. సరైన ఆధారాలను సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోవడం ఖాయమని చెప్తున్నారు. ఈ క్రమంలో బీఎల్‌వోల కంటే ముందే ఓటర్లు అప్రమత్తమై తమ ఓటు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్‌చేసుకొని తుది జాబితా ప్రచురణ నాటికి ఆధారాలను సమర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు రద్దయ్యే ప్రమాదం ఉంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
ఓటరుదే బాధ్యత..
ప్రస్తుత ‘సర్’ ప్రక్రియలో భాగంగా అధికారులు గుర్తించిన లోపాలను సరి చేసుకోవడం ఓటరు ప్రాథమిక బాధ్యతగా మారింది. డ్రాఫ్ట్ లిస్ట్‌లో చోటు దక్కిందనే ధీమాతో ఉంటే ఆఖరి నిమిషంలో ఓటరు కార్డు చెల్లకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోటీసులు అందుకున్న పౌరులు తమ దరఖాస్తులతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారుల నోటీసులకు సరైన సమయానికి రిప్లై ఇవ్వకపోయినా, అడిగిన ఆధారాలు సమర్పించడంలో విఫలమైనా సదరు ఓటరు పేరును తుది జాబితా నుంచి శాశ్వతంగా తొలగిస్తారని చెబుతున్నారు.
బీఎల్‌వోలు నో మ్యాపింగ్, అనామలీస్‌లో ఉన్న ప్రతి ఓటరు ఇంటికి వచ్చి సరిగ్గా ఎక్కడ లోపం ఉందో వివరిస్తూ అధికారిక నోటీసు అందజేస్తారు. సదరు ఓటరు ఆ నోటీసుకు తగిన రీతిలో స్పందిస్తూ.. తమ చిరునామా, వయస్సు, గుర్తింపు లేదా నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నోటీసు అందుకున్న తర్వాత నిర్దేశిత గడువులోగా స్పందించకపోయినా, బీఎల్‌వోలు అడిగిన ఆధారాలు అందజేయకపోయినా లేదా క్షేత్రస్థాయి తనిఖీల్లో సదరు వ్యక్తి సదరు చిరునామాలో లేరని తేలినా వారి ఓటును తొలగించే ప్రక్రియ చేపడతారు. అందువల్ల అధికారులు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి సహకారం అందించి, సరైన పత్రాలు అందిస్తేనే ఓటు భద్రంగా ఉంటుంది.
ఇలా చెక్ చేసుకోవచ్చు..
ఓటర్లు తమ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌నుగానీ, సీఈవో తెలంగాణ పోర్టల్‌నుగానీ సందర్శించి, ఓటర్‌కార్డు ఎపిక్ నెంబర్‌తో సెర్చ్ చేయడం ద్వారా తమ ఓటు సేఫ్‌గా ఉందో లేదంటే ‘అనామలీస్’ కేటగిరీలో ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎలక్టోరల్ సెర్చ్‌లో ఏవైనా వ్యత్యాసాలు లేదా నోటీస్ అలర్ట్స్ ఉన్నట్లు చూపిస్తే, వెంటనే అప్రమత్తమై సంబంధిత సవరణ ఫారాలను నింపి సిద్ధం చేసుకోవాలి. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు లేదా ఇతర నివాస ధ్రువీకరణ పత్రాలను ముందుగానే రెడీగా ఉంచుకోవడం వల్ల అధికారులకు సమర్పించడం ఈజీ అవుతుంది. డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకొని ఓటర్లు తమ వివరాలను ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం
కనిపిస్తోంది.
పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ
జిల్లాలవారీగా చూస్తే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే అనామలీస్, నో మ్యాపింగ్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నా యి. రాజధాని హైదరాబాద్ జిల్లాలో అత్యధి కంగా 8,95,000 అనామలీస్ నమోదు కాగా, ఏకంగా 18,50,000 నో మ్యాపింగ్ ఓటర్లు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 11,44,000 అనామలీస్, 22,000 నో మ్యాపింగ్ ఓటర్లు ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 3,30,862 అనామలీస్, 8,45,000 నో మ్యాపింగ్ కేసులు ఉన్నాయి. నిజామాబాద్ లో 3.92 లక్షలు అనామలీస్, 45 వేలు నో మ్యాపింగ్, సంగారెడ్డిలో 2.10 లక్షలు అనామలీస్, 48 వేలు నో మ్యాపింగ్, నల్గొండలో 1.65 లక్షలు అనామలీస్, 34 వేలు నో మ్యాపింగ్, కరీంనగర్‌లో 1.25 లక్షలు అనామలీస్,35 వేలు నో మ్యాపింగ్, ఖమ్మంలో 1.34 లక్షలు అనామలీస్, 26 వేలు నో మ్యాపింగ్ కేసులు నమోదయ్యాయి.
