- 2009లో మాదిరిగా సెప్టెంబర్ ప్రారంభంలోనే వెనక్కి వెళ్లనున్న రుతుపవనాలు
- 1966-67, 2014-15 నాటి కరువు పరిస్థితులు మళ్లీ రావొచ్చు
- ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే చాన్సే లేదు
- వర్షపాత లోటుతో వ్యవసాయ, విద్యుత్ రంగాలపై తీవ్ర ప్రభావం
- ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు స్కైమెట్ రిపోర్ట్ సూచన
న్యూఢిల్లీ: మన దేశానికి ఈ ఏడాది తీవ్ర కరువు ముప్పు పొంచి ఉందని ప్రముఖ ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించింది. దేశంలో కరువు ఏర్పడే అవకాశాలు గతంలో ఉన్న 60 శాతం నుంచి ఏకంగా 70 శాతానికి పెరిగినట్లు స్పష్టం చేసింది. ఈ పరిస్థితికి ఎల్ నినో ప్రభావంతోపాటు జూన్ నెల నుంచి వర్షాలు సరిగా కురవకపోవడమే ప్రధాన కారణాలని పేర్కొంది. సెప్టెంబర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.
దేశంలో వర్షపాతం పడిపోవడం వల్ల వ్యవసాయం, విద్యుత్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని, దీనివల్ల దేశ ఆర్థిక వృద్ధి రేటు(జీడీపీ) సుమారు 1 శాతం మేర తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందని స్కైమెట్ వ్యవస్థాపకుడు జతిన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వాల వద్ద తగినంత ఆహార నిల్వలు ఉండటంతో ధరలు అదుపులో ఉన్నాయని..కానీ, రాబోయే రోజుల్లో కరువు ప్రభావం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు దేశంలో వర్షపాత లోటు, ఆర్థిక ప్రభావంపై పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును జతిన్ సింగ్ సోమవారం రిలీజ్ చేశారు.
దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి
ఈ ఏడాది రుతుపవనాల సీజన్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశమే లేదని స్కైమెట్ స్పష్టం చేసింది. జూన్, ఆగస్టు నెలల్లో నమోదైన వర్షపాత లోటు కారణంగా రాబోయే సెప్టెంబర్‌లో కూడా సాధారణ వర్షాలు పడే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదని తెలిపింది. 2009 ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రుతుపవనాలు ముందస్తుగానే వెనక్కి వెళ్లిపోయే ముప్పు పొంచి ఉందని వివరించింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా సెప్టెంబర్ 17 నుంచి వెనక్కి వెళ్లడం ప్రారంభించి, అక్టోబర్ 15 నాటికి దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. అయితే, ఈ ఏడాది వర్షపట లోటు, ఎల్ నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు సాధారణం కంటే ముందస్తుగానే సెప్టెంబర్ ప్రారంభంలోనే వెనక్కి వెళ్లిపోయే ముప్పు ఉందని స్కైమెట్ నివేదిక హెచ్చరించింది. తిరోగమనానికి సంబంధించిన కచ్చితమైన అధికారిక తేదీలను వాతావరణ పరిస్థితులను బట్టి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటిస్తుంది. ఒకదాని వెనుక ఒకటిగా ఎల్ నినో సంవత్సరాలు రావడం, వరుసగా కరువులు సంభవించడం చాలా అరుదుగా జరుగుతుందని.. ఇది గతంలో 1966~67, 2014~15 సంవత్సరాల్లో మాత్రమే జరిగిందని జతిన్ సింగ్ గుర్తుచేశారు. హిందూ మహాసముద్రంలో వేడెక్కే ఉష్ణోగ్రతలు సైతం ఈసారి వర్షపాత లోటును పూడ్చలేకపోయాయని వెల్లడించారు. దీంతో దేశంలో అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.
ముందస్తు చర్యలు అవసరం
వర్షపాత లోటు ప్రభావం దేశంలోని అనేక రాష్ట్రాలపై పడనుందని జతిన్ సింగ్ తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలు కరువు ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో వర్షాలు అసలే లేకపోవడంతో ఆ ప్రాంతం రెడ్ అలర్ట్ జోన్‌లోకి వెళ్లిందన్నారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలకు కాల్వల ద్వారా నీటి వసతి ఉన్నప్పటికీ.. దక్షిణ , మధ్య భారతదేశంలోని రాష్ట్రాలు మాత్రం వర్షాలు, నదులపైనే పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల రాబోయే రబీ పంట సీజన్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామాలు రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తాయని..దీనిపై ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్కైమెట్ నివేదిక పేర్కొంది.
