వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం అసెంబ్లీలో వ్యవసాయ బిల్లుల కాపీలను చింపివేశారు. రైతులు ఇంకెన్ని త్యాగాలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఒకరోజు సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించిన పేపర్లను సభాముఖంగా చించేశారు. బ్రిటీషు వారికన్నా క్రూరంగా మారవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో నూతన చట్టాలను హడావిడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజ్యసభలో ఓటింగ్‌ లేకుండా మొదటిసారి 3 చట్టాలను తీసుకొచ్చారని అన్నారు. ప్రతి రైతు భగత్‌సింగ్‌లా మారుతున్నారన్నారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ సీఎం ఈ చట్టాలు లాభదాయకమని చెబుతున్నారని… ఇది ఏ రకంగా లాభమో చెప్పాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

అంతకు ముందు ఢిల్లీ రవాణా మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు కైలాష్‌ గహ్లోత్‌ మూడు వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.