న్యూఢిల్లీ, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను అధ్యయనం చేసి, నష్టాన్ని అంచనా వేసేందుకు తెలంగాణకు కరువు బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ బృందం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా తెలంగాణకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కృషి భవన్‌లోని చాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు.
ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశీ కృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు రామకృష్ణారావు, సెక్రటరీ కో–ఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన –గ్రామీణ్ (పీఎంఏవైజీ) కింద ఇండ్ల మంజూరు, ఉపాధి హామీ నిధుల విడుదల, పలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించారు.
ఎల్‌నినో నేపథ్యంలో వీబీ జీ రామ్ జీలో అదనపు పనులు చేర్చాలని కేంద్ర మంత్రిని సీఎం విజ్ఞప్తి చేశారు. వర్షాభావంతో పనులు లేనందున ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలకు జీవనోపాధులు మెరుగుపర్చేందుకు, పంటల వైవిధ్యీకరణ ప్రోత్సాహానికి అదనపు పనులను చట్టంలో చేర్చాలని కోరారు.
రైతులు తమ భూముల్లో కూరగాయల పందిళ్లు, పశుగ్రాసం ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇండ్ల సమీపంలో ఆకు కూరలు, కూరగాయల తోటలు, వెదురు వనాలు పెంచుకునే పనులను వీబీ జీ రామ్ జీలో చేర్చాలని రిక్వెస్ట్ చేశారు. కొండ ప్రాంతాలతోపాటు కొండవాలుల్లో నీటి నిల్వ చేసుకునే కందకాలు, ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్లు, పండ్ల తోటల్లో తేమ రక్షణకు కందకాల నిర్మాణం, వరదలు, ఇసుక మేటలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణకు అవసరమైన పనులు వీబీ జీ రామ్ జీలో చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు.
తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు ఇవ్వండి
పీఎంఏవై(జీ)–2 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత12 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు పీఎంఏవై–జీ స్కీం కింద ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. కానీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇండ్ల నిర్మాణ కోసం వేల కోట్లను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. అందువల్ల తెలంగాణలో అర్హత కలిగిన పేదల కోసం 11,56,915 ఇండ్లను కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
‘‘గత ప్రభుత్వం (పీఎంఏవైజీ) ను వినియోగించుకోకపోవడంతో రాష్ట్రంలో గత 12 ఏండ్లలో పేదలు సొంత ఇండ్లు నిర్మించుకోలేదు. దీంతో ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించాం. సాధ్యమైనంత త్వరగా తెలంగాణకు ఇండ్లు కేటాయించాలి’’ అని కేంద్ర మంత్రిని కోరినట్టు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి పనుల విషయంలో సమస్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వాటి పరిష్కారానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మీడియాకు వెల్లడించారు.
