- కొడంగల్‌లోని సీఎం నివాసంలో పార్టీ నాయకులు, బీఎల్‌ఏలకు ‘సర్’పై అవగాహన
కొడంగల్, వెలుగు: బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటై కొడంగల్‌లో కాంగ్రెస్‌ను, తనను దొంగ దెబ్బ తీయాలని గూడుపుఠాణీ చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటకు రాకుండా ఉంటారని కుట్రలు చేస్తున్నారని ఫైర్అయ్యారు. కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం తనకు వచ్చిందని పేర్కొన్నారు. బుధవారం కొడంగల్‌లోని నివాసంలో పార్టీ నాయకులు, బీఎల్‌ఏలకు ‘సర్’పై సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన కల్పించారు.
నియోజకవర్గంలో 2,51,255 ఓటర్లు ఉండగా.. 1,96,622 ఓటర్ల డిజిటలైజేషన్మాత్రమే పూర్తయిందని చెప్పారు. ఇంకా 54,635 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ చేసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరి ఓటుకూడా పోకుండా తిరిగి నమోదు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై ఉందని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లతో ఎన్యూమరేషన్ ఫారం పూర్తిచేయించి తీసుకోవాలని పార్టీ నేతలు, బీఎల్‌ఏలను అదేశించారు. ఈ నెల 30 వరకు అర్హత ఉన్న ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు 10 రోజులపాటు తమ సొంత పనులు పక్కనపెట్టి ఊరూరా తిరుగుతూ ఓటర్లను చైతన్యపరచాలన్నారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు రోజుకు 18 గంటలు పనిచేసినా తనకు సమయం సరిపోవడం లేదని చెప్పారు.
