ఏ జిల్లానూ తొలగించం.. అది పూర్తిగా తప్పుడు ప్రచారమే: సీఎం రేవంత్‌‌‌‌

ఏ జిల్లానూ తొలగించం.. అది పూర్తిగా తప్పుడు ప్రచారమే: సీఎం రేవంత్‌‌‌‌
  • బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌.. బిల్లా రంగా పార్టీలు
  • అవి రెండూ కుమ్మక్కయ్యాయి
  • ఫోన్ ట్యాపింగ్​తో వ్యాపారం..  వందల కోట్లు దోచుకున్నరు
  • సీబీఐ, ఈడీ ఉన్నది గాంధీ కుటుంబాన్ని వేధించడానికేనా?
  • తప్పు చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌పై  కేసులు ఉండవా?
  • కిషన్‌‌‌‌రెడ్డివి నల్లికుట్ల మాటలు.. వాళ్లని అరెస్టు చేసేదాకా 
  • కల్వకుంట్ల కిషన్‌‌‌‌రావు అనే పిలుస్తం 
  • సింగరేణిలో మెడికల్ అన్‌‌‌‌ఫిట్‌‌‌‌ బోర్డును రద్దు చేస్తామని హామీ
  • జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి బాట

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో ఏ జిల్లానూ తొలగించడం కానీ, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. ఎప్పుడైనా జిల్లాలను పునఃవ్యవస్థీకరించాలన్నా.. లేకపోతే రేషనలైజ్ చేయాలన్నా.. బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి.. ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.12.15 కోట్లతో నిర్మించిన వీఐపీ అతిథి గృహాన్ని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ప్రజాపాలన–ప్రగతిబాట సభలో మాట్లాడారు.

 ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని  పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ అని పేర్కొన్నారు. 1969 తొలి తెలంగాణ, 2009 మలి తెలంగాణ ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాటం చేశారని గుర్తుచేశారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కర్త, కర్మ, క్రియగా మారి  క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా వ్యూహ రచన చేసిన  ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతానికి చెందినవారేనని తెలిపారు. జయశంకర్​ సార్ ఆలోచన, కాళోజీ ఆవేశంతో తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా ఆదర్శంగా నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నదని వ్యాఖ్యానించారు.   నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులు ఈ దేశానికే ఆదర్శమని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఏపీతోపాటు లోకానికే వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. చిన్న గ్రామంగా ఉన్న భూపాలపల్లిని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రంగా చేసి.. బొగ్గు ఉత్పత్తికి పునాది వేశారని గుర్తు చేశారు. 600 జనాభాగా ఉన్న భూపాలపల్లి.. 60 వేల ఓట్లు.. లక్ష జనాభాతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది సింగరేణి కార్మికులు పిడికిలి బిగించి కొట్లాడారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. 

విషం చిమ్మేవారి వీపుమీద దెబ్బలేయాలె..

సింగరేణి కార్మికుల మెడికల్ బోర్డు విషయంలో విషం చిమ్మే వాళ్లందరినీ  మోకాళ్లమీద కూర్చోబెట్టి వీపు మీద నాలుగు దెబ్బలేయాలేని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. ఆ ఆలోచనే ప్రభుత్వ పరిశీలనలో లేదని చెప్పారు. కార్మికులు కోరుకున్న విధంగా.. కార్మికులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప నష్టం కలిగించే ఏ నిర్ణయం తీసుకోబోదని తెలిపారు. సింగరేణి బొగ్గుగని కార్మికులు నిండు మనసుతో పనిచేయడమే కాకుండా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కాంగ్రెస్ జెండా భుజాన పెట్టుకుని మోసిండ్రు కాబట్టే ఈ రోజు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. కార్మికులకు నష్టం కలిగే ఏ పని కూడా ఈ ప్రభుత్వం చేయబోదని తెలిపారు. డిస్మిస్డ్‌‌‌‌‌‌‌‌ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 217 మంది సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. 

కొత్త బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రెండో  విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నట్టు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. రెండేండ్లలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రూ. 22,500 కోట్లతో  4.5 లక్షల ఇండ్లు నిర్మించినట్టు వెల్లడించారు. పేదల ఆత్మగౌరవం పెరిగేలా, ఆడబిడ్డలు ఆశీర్వదించేలా రెండో విడత కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. భూపాలపల్లి జిల్లాలో నిరుడు జరిగిన సరస్వతీ పుష్కరాలు ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు.

వెయ్యేండ్లు గుర్తుండేలా మేడారం రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు  నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.  2027లో జరిగే గోదావరి పుష్కరాలకు శాశ్వత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన  బాసర నుంచి భద్రాచలం వరకు పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 4  వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. పదేండ్లు కేసీఆర్ సీఎంగా, మూడు సార్లు మోదీ  ప్రధానిగా  అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. కేసీఆర్, మోదీని  చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ చెబుతున్నాయని, గల్లీలో మోరీలు కేసీఆర్ వచ్చి తీస్తాడా? లేక మోదీ వచ్చి తీస్తాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓటేస్తేనే గల్లీలో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కేసీఆర్ పదేండ్లు సీఎంగా ఉన్నా భూపాలపల్లికి బైపాస్ రోడ్డు తీసుకురాలేదని, ప్రధాని మోదీ ఏనాడు భూపాలపల్లికి రాలేదని చెప్పారు. గడిచిన రెండేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.17,442 కోట్లు ఖర్చు చేసిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.6,116 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. 

బీఆర్ఎస్​ అంటే బ్లాక్​మెయిల్ రాజకీయ సమితి..

బీఆర్ఎస్​ అంటే ఇక నుంచి బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని.. బిల్లా రంగాలా మారి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్​ చీకటి ఒప్పందాలతో చేస్తున్న నాటకాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దేశం కోసం, పేదల కోసం వేలకోట్ల ఆస్తులు దానం చేసిన సోనియా, రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీని కేసుల పేరుతో సీబీఐ, ఈడీ  వేధింపులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు.  బీఆర్ఎస్​ చేసిన పాపాలు ఊరికేపోవని అన్నారు.  ఫార్ములా ఈ  రేస్‌‌‌‌‌‌‌‌ కేసులో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడుతున్నది కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డే అని ఆరోపించారు. కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి.. కల్వకుంట్ల కిషన్‌‌‌‌‌‌‌‌రావుగా మారి కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేయకుండా నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. - కేంద్రం వాళ్లని అరెస్టు చేసేదాకా కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అనే పిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్​ చైర్మన్​ అయిత ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రియాజ్, కోట రాజబాబు, బట్టు కర్నాకర్​, గాజర్ల అశోక్​ తదితరులు పాల్గొన్నారు. 

పేదలకు ఇండ్లు ఇయ్యలే.. వాళ్లకు మాత్రం ఫామ్‌‌‌‌హౌజ్‌‌‌‌లు..

పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు  కట్టి ఇవ్వలేదు కానీ.. వారు మాత్రం వందల ఎకరాల్లో ఫామ్‌‌‌‌హౌజ్‌‌‌‌లు కట్టుకున్నారని రేవంత్‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. వెయ్యి ఎకరాల్లో ఎర్రవల్లిలో కేసీఆర్​, 100 ఎకరాల్లో జన్వాడలో కేటీఆర్​, హరీశ్‌‌‌‌రావు, కవిత, సంతోష్‌‌‌‌రావు ఫాంహౌజ్‌‌‌‌లు నిర్మించుకున్నారని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో వైఎస్సార్​ సీఎంగా ఉన్నప్పుడు  ప్రతి పేదవాడికి కాంగ్రెస్​ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని, 25 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చిందని చెప్పారు.  ఆ ఇండ్లపై పిట్ట కథలు చెప్పిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. పదేండ్లలో  ఏ ఒక్క నిరుపేదకు డబుల్​ బెడ్​రూం ఇల్లు కట్టియ్యలేదన్నారు.  పేదలకు ఇండ్లు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబానికి టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు  వచ్చాయని మండిపడ్డారు. ఏడాదికి 2 లక్షల ఇండ్లు కడితే పదేండ్లలో 20 లక్షల ఇండ్లు కట్టే అవకాశం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఉండేదని.. కానీ ఆ పని ఆయన చేయలేదన్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌గా తాను భూపాలపల్లి నుంచే  రైతు పోరుబాట, కార్మికుల పోరుబాట చేపట్టానని గుర్తు చేశారు. 

పక్కనే గోదావరి ఉన్నా ఎకరం పారలే..: మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

తలాపున గోదావరి ఉన్నా జిల్లాలో ఒక్క ఎకరం కూడా పారలేదని  మంత్రి  శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పేర్కొన్నారు.   కాటారం డివిజన్‌‌‌‌‌‌‌‌లోని 5 మండలాలకు వరప్రదాయినిగా ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో పట్టించుకోలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇక్కడి నుంచి గోదావరి జలాలను తీసుకెళ్లారు తప్పితే ఇక్కడ ఒక్క ఎకరాకు సాగునీరివ్వలేదని చెప్పారు. జిల్లాలోని బీంగణపూర్, గణపురం చెరువులకు సిమెంట్ లైనింగ్ పనులతోపాటు చిట్యాల మండలం జూకల్, టేకుమట్ల మండలం బూర్నపల్లి, భూపాలపల్లి మండలంలోని గొర్లవీడులోని ఇందిరాసాగర్, మోరంచవాగులపై చెక్ డ్యామ్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. 

పేదలకు అండగా ఉంటున్నం: మంత్రి పొంగులేటి 

ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  గడిచిన రెండేండ్ల కాలంలో పేదలకు సన్న బియ్యం, రేషన్​ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌‌‌‌‌‌‌‌లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చిన చీరెలు పంట చేన్లో బెదుర్లకు వాడారని, సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆడబిడ్డల ఆత్మగౌరమే తన ఆత్మాభిమానంగా భావించి నాణ్యమైన చీరెలు పంపిణీ చేశారని తెలిపారు.