- ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మున్సిపల్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష
- సైబరాబాద్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆదేశాలు
- మన్మోహన్ సింగ్ విగ్రహ నిర్మాణం, జంక్షన్, ఎన్‌ఐయూఎమ్, ఎమ్‌ఎమ్‌సీ భవన నమూనాల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ టెండర్లు పిలవకూడదని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూ సమస్యలతో నిర్మాణ పనులు నిలిచిపోకుండా ఉండేందుకు వీలుగా భూసేకరణ ప్రక్రియ కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్టు వెల్లడించారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీఐలోని బోధి పెవిలియన్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కమిషనరేట్ల అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో వివిధ శాఖల మధ్య అనుమతుల ఆలస్యాన్ని నివారించేందుకు జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని అధికారులతో క్రమం తప్పకుండా ఉమ్మడి సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
మూడు మున్సిపల్ కమిషనరేట్ల పరిధిలో ప్రస్తుతం పురోగతిలో ఉన్న మౌలిక వసతుల కల్పన పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతికి వివిధ ప్రభుత్వ విభాగాలు, లైన్ డిపార్ట్‌మెంట్ల నుంచి వచ్చే అనుమతులు అడ్డంకిగా మారకూడదని స్పష్టం చేశారు.
విద్యుత్, జలమండలి, రెవెన్యూ, రహదారులు, -భవనాల శాఖ సమన్వయంతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరించుకోవాలని సూచించారు. ఇకపై టెండర్లు పిలిచే ముందే క్షేత్రస్థాయిలో భూసేకరణ సమస్యలు లేకుండా చూడటం ద్వారా ప్రాజెక్ట్ వ్యయం పెరగకుండా పనుల్లో జాప్యం జరగకుండా నివారించవచ్చని తెలిపారు. ఈ మేరకు భూసేకరణపై ప్రత్యేక అధికారి ద్వారా వేగంగా ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాతి దశ పనులను ప్రారంభించాలని ఇంజనీరింగ్ విభాగాలకు సూచనలు చేశారు.
సైబరాబాద్ పరిధిలో పనులను వేగవంతం చేయాలి
ఐటీ కారిడార్ అయిన సైబరాబాద్ పరిధిలో ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులను హెచ్‌ఎండీఏ వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహ నిర్మాణం, అనుబంధంగా ఉన్న జంక్షన్ అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్, మల్కాజిగిరి కార్పొరేషన్ పరిపాలనా భవనాల నమూనాలను ప్రదర్శించారు.
డిజైన్లను నిశితంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, నగర భవిష్యత్తు అవసరాలు, ప్రజా సేవల సమర్థత భవనాల ఆకృతులకు సంబంధించి తగిన మార్పులు, చేర్పులను సూచించారు. ఈ భేటీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి. సృజన, ఎమ్‌ఎమ్‌సీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా కమిషనర్ వి. రంగనాథ్, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
