ప్రభుత్వం ఏం చేస్తుందో జనాలకు తెలియాలి..పీఆర్‌‌వోల శిక్షణపై సీఎం ఫోకస్‌‌

ప్రభుత్వం ఏం చేస్తుందో జనాలకు తెలియాలి..పీఆర్‌‌వోల శిక్షణపై సీఎం ఫోకస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పౌరుడికీ చేరేలా సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రెండేళ్లుగా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు పీఆర్‌‌వోల పాత్ర కీలకమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్‌‌వోల శిక్షణ, సామర్థ్య పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎంవో, మంత్రుల వద్ద పనిచేస్తున్న పీఆర్‌‌వోలు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు.

మహాలక్ష్మి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం, రైతుల రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్‌‌ నుంచి గిగ్ వర్కర్ల చట్టం వరకు అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం భావిస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలు నుంచి రైతులు, మహిళలు, యువత, పేదల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి కుటుంబానికీ చేరేలా నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ దిశగా సీఎం సీపీఆర్‌‌వో గుర్రం మల్సూర్‌‌ నేతృత్వంలో మంత్రుల పీఆర్‌‌వోలు, సోషల్‌‌ మీడియా కోఆర్డినేటర్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం సీపీఆర్‌‌వో బృందం, మంత్రుల సోషల్‌‌ మీడియా విభాగాల కోఆర్డినేటర్లు కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నారు.