- సౌత్ స్టేట్స్ మనుగడ కోసం నడుద్దాం
- మహిళా కోటా ముసుగులో జరుగుతున్న అన్యాయాన్ని ఆపుదాం
- హైబ్రీడ్ మోడల్ వైపు అడుగులేద్దాం.. హక్కులు కాపాడుకుందామని పిలుపు
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ స్థానాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రో-రెటా, జనాభా ప్రాతిపదిక నమూనాలను వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్, పుదుచ్చేరి సీఎం రంగసామికి ఈ లేఖలు పంపారు. ప్రోరెటా, జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచితే పార్లమెంటులో సౌత్ స్టేట్స్ రాజకీయ ప్రాబల్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆ లేఖల్లో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ అన్యాయంపై పార్లమెంట్ వేదికగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదని, మొత్తం దక్షిణాది మనుగడకు సంబంధించిన చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవడానికి అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడంలో ఏమాత్రం రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాల సీఎంలను కూడా కలుపుకోవాలని ప్రతిపాదించారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సౌత్స్టేట్స్ రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించే ఏ ప్రయత్నాన్నైనా తిప్పికొట్టేలా మన కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ పోరాటం మన భవిష్యత్తు తరా ల రాజకీయ హక్కుల కోసమని పేర్కొన్నారు.
మహిళా కోటాకు ఓకే.. కానీ..
కాంగ్రెస్ పార్టీ మహిళా కోటాకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని, కానీ దానిని అమలు చేయడానికి సీట్ల సం ఖ్య పెంచాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాల్లోనే వెంటనే 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని ఆయన ప్రతిపాదించారు. అలాగే అన్ని రాష్ట్రా ల అసెంబ్లీల్లో కూడా ఎటువంటి జాప్యం లేకుండా మహిళా కోటాను అమలు చేయవచ్చన్నారు. మహిళా కోటాను నెపంగా చూపి దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నాలను సహించకూడదని చెప్పారు. గతంలోనూ సీట్ల సంఖ్యను పెంచకుండా కేవలం నియోజకవర్గ సరిహద్దులను మార్చే డీలిమిటేషన్ ప్రక్రియలు జరిగాయని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రాల పరిధిలో జనాభా సమతుల్యత కోసం సరిహద్దులను సవరించుకోవడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. కానీ దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించడమే అసలైన వివాదాస్పద అంశమని స్పష్టం చేశారు.
స్టాలిన్ చొరవను బలపరుద్దాం
తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ గతంలోనే ఈ ముప్పును గుర్తించారని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొ న్నారు. 2025 మార్చిలో చెన్నైలో నిర్వహించిన 'డీలిమిటేషన్ కాన్క్లేవ్' ఎంతో ముఖ్యమైనదని ఆయన గుర్తు చేశారు. స్టాలిన్ చొరవ వల్లే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక వేదికపైకి వచ్చాయని రేవంత్ రెడ్డి అభినందించారు. స్టాలిన్ విడుదల చేసిన వీడియో సందేశానికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లు లేఖలో ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం జనాభా లెక్కల ఆధారిత పద్ధతిని పక్కన పెట్టినట్లు కనిపిస్తున్నా, ప్రో-రెటా పేరుతో అదే అన్యాయం చేయాలని చూస్తున్నదన్నారు. ఈ విషయంలో మన పోరాటం కేవలం మన రాష్ట్రాల కోసమే కాదని, దేశ ప్రజాస్వామ్య సమతుల్యత కోసమని ఆయన వివరించారు. దక్షిణాది రాష్ట్రాల ఐక్యత ఈ దేశ రాజకీయాల్లో ఒక కొత్త దిశను నిర్దేశిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. 50% కోటా 50% మెరిట్ సూత్రంగా ‘హైబ్రిడ్ మోడల్’ను తన లేఖల్లో వివరించారు.
దక్షిణాది ప్రాతినిధ్యం పడిపోతుంది
ప్రో-రెటా పద్ధతి వల్ల రాష్ట్రాల మధ్య రాజకీయంగా చాలా గ్యాప్ పెరుగుతుందని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉదాహరణలతో సహా వివరించారు. అన్ని రాష్ట్రాలకు సీట్లు పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది ప్రాతినిధ్యం దారుణంగా పడిపోతుందని రేవంత్ రెడ్డి వివరించారు. జనాభా ఎక్కువఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పార్లమెంటులో వారి మాటే చెల్లుబాటు అవుతుందన్నారు. కేవలం గణాంకాల సర్దుబాటు మాత్రమే కాదని, దేశ రాజకీయాల్లో ఒక వ్యవస్థాగత మార్పుకు దారితీస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ప్రగతి సాధించినా, రాజకీయంగా వారి ప్రాముఖ్యతను తగ్గించేలా ఈ నమూనా ఉందని విమర్శించారు.
ఫెడరల్ బ్యాలెన్స్ కాపాడుకుందాం
ఆంధ్రప్రదేశ్ సీట్లు 25 నుంచి 38కి పెరిగితే, అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీట్లు మాత్రం 80 నుంచి 120కి పెరుగుతాయని రేవంత్ చెప్పారు. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం 55 నుంచి ఏకంగా 82 సీట్లకు చేరుతుందని ఆయన వివరించారు. కర్నాటకలో 28 సీట్లు ఉన్నప్పుడు యూపీతో పోలిస్తే 52 సీట్ల తేడా ఉండేదని, కొత్త విధానంలో ఆ గ్యాప్ 78 సీట్లకు పెరుగుతుందని పేర్కొన్నారు. కేరళలో 20 సీట్ల నుంచి 30కి పెరిగినా, యూపీతో వ్యత్యాసం 60 నుంచి 90కి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి సీట్లు కలిపి 40 నుంచి 60కి పెరిగినా, యూపీతో పోల్చినప్పుడు ఈ వ్యత్యాసం 40 నుంచి 60 సీట్ల తేడాకు పెరుగుతుందని తెలిపారు. ఈ అసమానత దక్షిణాది రాష్ట్రాల గొంతును పార్లమెంటులో పూర్తిగా వినిపించకుండా చేస్తుందన్నారు. సౌత్‌లోని ప్రతి రాష్ట్రానికి ఇలాంటి అన్యాయమే జరుగుతుందని, అందుకే మనమందరం కలిసి పోరాడాలని రేవంత్ రెడ్డి తన లేఖల్లో ప్రతిపాదించారు. రాజకీయంగా మన గొంతును కాపాడుకోవడానికి ఇదే సరైన సమయమని రేవంత్ పేర్కొన్నారు. విద్య, ప్రజారోగ్యం, మానవాభివృద్ధి సూచీల్లో దక్షిణాది రాష్ట్రాలు అద్భుతమైన ఫలితాలను సాధించాయని వివరించారు. కానీ ఇప్పుడు అవే విజయాలు మనకు శాపంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల కష్టాన్ని, నిబద్ధతను కేంద్రం గుర్తించడం లేదని విమర్శించారు. అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకోకుండా కేవలం జనాభాను చూడడం ఫెడరల్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుందన్నారు. ఇప్పటికే ఆర్థిక అన్యాయాన్ని ఎదుర్కొంటున్న దక్షిణాది రాష్ట్రాలకు, ఇప్పుడు రాజకీయ అన్యాయం కూడా తోడైతే భవిష్యత్తు అంధకారమవుతుందని సీఎం హెచ్చరించారు.

