హైడ్రాను వద్దంటున్నది BRS లీడర్లు, కబ్జాకోరులే.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా: CM రేవంత్‌‌‌‌రెడ్డి

హైడ్రాను వద్దంటున్నది BRS లీడర్లు, కబ్జాకోరులే.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా: CM రేవంత్‌‌‌‌రెడ్డి
  • మాకు కోర్టులపై విశ్వాసం ఉంది..
  • తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం
  • హైడ్రా.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్
  • రాష్ట్రంలో ఇకపై ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ సమస్య ఉండదు
  • పేపర్ లీకేజీపై కేంద్ర చట్టం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: హైడ్రాను కబ్జాకోరులు, బీఆర్ఎస్ లీడర్లే వద్దంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులను కబ్జా చేసినోళ్లు.. కోర్టు ధిక్కరణ పిటిషన్లతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై అధికారులను మార్చవచ్చంటే.. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సీనియర్ అధికారిగా కొనసాగిన సోమేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌పై దాదాపు 400 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని, ఆ రోజు బీఆర్ఎస్ సర్కార్ ఇలాంటి అంశాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 

ఒక అధికారిని ఎక్కడ నియమించాలి అనేది ప్రభుత్వ విచక్షణాధికారం అని తెలిపారు. ఈ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కోర్టు ధిక్కరణ పిటిషన్లను ఆ కోర్టులోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌తో భేటీ అనంతరం హైడ్రా అంశంపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  హైడ్రా మంచి పనులు చేస్తున్నదని చెప్పారు. 

‘‘మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా. నాలాలు, చెరువులను మేం పరిరక్షిస్తున్నాం. అలాగే, నీటి కుంటలను కాపాడుకుంటున్నాం. హైడ్రాను మరింత బలోపేతం చేయబోతున్నాం. ఇదొక మంచి ఇనిస్టిట్యూషన్.. దేశంలోనే హైడ్రాకు మంచి పేరు వచ్చింది. హైడ్రా స్వాధీనం చేసుకొన్న ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలేదు. ప్రభుత్వం తీసుకుంది. చెరువులు, కుంటలను పునరుద్ధరించాం. ఆక్రమించుకున్నవాళ్లు.. ధనవంతులైనా, పేదవారైనా ప్రభుత్వం ఒకే విధంగా ముందుకెళ్తుంది’’ అని సీఎం స్పష్టం చేశారు. 

హైడ్రా అత్యుత్తమ సంస్థల్లో ఒక‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌ని, ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే హైడ్రా విధి అని, ఆ పనిని ప‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌డ్బందీగా చేస్తున్నదని తెలిపారు. ముఖీం అనే కబ్జా కోరు వందల ఎకరాల భూమిని కబ్జా పెట్టాడని, దాన్ని హైడ్రా ఖాళీ చేయించిందన్నారు. హైడ్రాను పని చేయకుండా చూడాలనే కబ్జాకోరులకు ఎవరూ సహకరించవద్దని ప్రజలను కోరారు. 

విద్యా వ్యవస్థను రాష్ట్ర పరిధిలోనే ఉంచాలి 

ప్రశ్నా ప‌‌‌‌‌‌‌‌త్రాల లీకేజీల‌‌‌‌‌‌‌‌కు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షించాల‌‌‌‌‌‌‌‌ని రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. పరీక్షలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవ‌‌‌‌‌‌‌‌ని, ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించినప్పుడే ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌ వస్తున్నాయ‌‌‌‌‌‌‌‌న్నారు. అనుమ‌‌‌‌‌‌‌‌తి లేకుండానే దేశంలో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ‌‌‌‌‌‌‌‌ని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయ‌‌‌‌‌‌‌‌ని అన్నారు. ఈ విష‌‌‌‌‌‌‌‌యంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందని తెలిపారు. 

యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయ‌‌‌‌‌‌‌‌త్నాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాల‌‌‌‌‌‌‌‌ని హితవు పలికారు. విద్యను  వీలైనంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం త‌‌‌‌‌‌‌‌క్కువ‌‌‌‌‌‌‌‌గా ఉంటుంద‌‌‌‌‌‌‌‌ని, ఈ అంశంపై పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో చర్చ జరగాల్సి ఉంద‌‌‌‌‌‌‌‌న్నారు. స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో చ‌‌‌‌‌‌‌‌ర్చ జ‌‌‌‌‌‌‌‌రిగితే రాహుల్ గాంధీ అన్ని అంశాల‌‌‌‌‌‌‌‌పై మాట్లాడతార‌‌‌‌‌‌‌‌ని రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. 

ప్రశ్నాప‌‌‌‌‌‌‌‌త్రాల లీకేజీల నివార‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసే చ‌‌‌‌‌‌‌‌ట్టాన్ని చూసి.. త‌‌‌‌‌‌‌‌ర్వాత రాష్ట్రంలో ఏం చేయాల‌‌‌‌‌‌‌‌నేది నిర్ణయిస్తామన్నారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌‌‌‌‌‌‌ను ప్రక్షాళన చేసి.. నియామకాలు చేపట్టడంతోనే తాము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామ‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. 

విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా, వారికి నమ్మకం, విశ్వాసం కలిగించేలా పార‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌ర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సీఎం చెప్పారు. గ్లోబరీనాలాంటి  సంస్థలు నాడు అక్రమాలకు పాల్పడినా గ‌‌‌‌‌‌‌‌త ప్రభుత్వం చ‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకోక‌‌‌‌‌‌‌‌పోవ‌‌‌‌‌‌‌‌డంతో వాళ్లు సీబీఎస్ఈ పరీక్షల వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు విస్తరించి, వాటిని గంద‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌గోళం చేశార‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంద‌‌‌‌‌‌‌‌ని  స్పష్టం చేశారు. 

ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిల పాపం బీఆర్ఎస్‎దే 

ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిల పాపం గత బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేనని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మండిపడ్డారు.  కేసీఆర్ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలను పెట్టి పోయింద‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. ఎలాంటి వసతులు లేకుండా.. దొంగ లెక్కలు చూపించి ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ కొట్టేయాలనుకునే సంస్థల మీద విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ విచారణ సాగుతోంద‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. 
స‌‌‌‌‌‌‌‌క్రమంగా ఉన్నవాళ్లకు బ‌‌‌‌‌‌‌‌కాయిలు చెల్లిస్తామ‌‌‌‌‌‌‌‌ని స్పష్టం చేశారు. ‘‘కేసీఆర్ పెట్టిన బకాయిలే మాకు భారంగా మారాయి. మేం ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వడం లేదన్నట్టుగా.. మా ప్రభుత్వం కారణమన్నట్టుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోంది. దానికి బీజేపీ వంత‌‌‌‌‌‌‌‌పాడుతోంది” అని ఆరోపించారు.  

భవిష్యత్తులో  ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ సమస్య ఉండదు..

ఏపీలో ఫీజు బ‌‌‌‌‌‌‌‌కాయిల‌‌‌‌‌‌‌‌పై బీజేపీ ఎంపీ ఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య ఎందుకు మాట్లాడ‌‌‌‌‌‌‌‌డం లేద‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. కూట‌‌‌‌‌‌‌‌మి ప్రభుత్వం ఉన్న ఏపీలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ చేయించిన తర్వాత తెలంగాణలో డిమాండ్ చేస్తే బాగుంటుందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కృష్ణయ్యతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ రామచందర్‌‌‌‌‌‌‌‌రావుకు సీఎం హితవుపలికారు. గత ప్రభుత్వం బకాయిలే భారంగా మారినా.. అన్ని స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యలు ప‌‌‌‌‌‌‌‌రిష్కరించే ప్రయ‌‌‌‌‌‌‌‌త్నం చేస్తున్నామ‌‌‌‌‌‌‌‌న్నారు. 

భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తం అదే ఏడాదిలో పూర్తిగా చెల్లిస్తామ‌‌‌‌‌‌‌‌ని చెప్పారు.  అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌గా బ్యాంక్ ఖాతాల్లో వేస్తామ‌‌‌‌‌‌‌‌ని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఏటా రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు అవసరమవుతాయ‌‌‌‌‌‌‌‌న్నారు. క్రమం త‌‌‌‌‌‌‌‌ప్పకుండా వాటిని చెల్లించేందుకు త‌‌‌‌‌‌‌‌మ ప్రభుత్వం ప్రణాళికలు రచించుకుంద‌‌‌‌‌‌‌‌ని, భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ సమస్య రాష్ట్రంలో ఉండబోద‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు.