విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ యాజమాన్యాలదే బాధ్యత: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ యాజమాన్యాలదే బాధ్యత: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేక వింగ్ ​ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ విక్రేతలు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపేలా కఠిన చర్యలు
  •  అవసరమైతే కొత్త చట్టం రూపకల్పన.. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి, నిరోధక చర్యలపై శుక్రవారం సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగం, విక్రయాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, క్యాంపస్ లోపల జరిగే ఎటువంటి డ్రగ్స్ సంబంధిత ఘటనకైనా సదరు కాలేజీ లేదా స్కూల్ యాజమాన్యాలనే బాధ్యులను చేయాలని నిర్ణయించారు.

క్యాంపస్ వెలుపల జరిగే అనుమానాస్పద యాక్టివిటీని ముందే గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. డ్రగ్స్ మహమ్మారిని మూలాల నుంచి పెకిలించి వేసేందుకు విక్రేతలు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపేలా ప్రస్తుత ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేయాలన్నారు.

అవసరమైతే ప్రత్యేకంగా నూతన చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రవర్తనను గమనించేందుకు ప్రతి విద్యాసంస్థలో ఒక ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. విద్యార్థులు లేదా ఇతరులు డ్రగ్స్ సమాచారాన్ని గోప్యంగా అందించేందుకు వీలుగా విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నంబర్లు, ప్రత్యేక క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌లను అందుబాటులో ఉంచే అంశంపై కసరత్తు చేయాలన్నారు.

మరోవైపు, రాష్ట్రంలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం అనే మూడంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా తొలిసారి డ్రగ్స్ స్వీకరిస్తూ పట్టుబడిన వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించి, కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. తరుచూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే జైలు శిక్షలతో పాటు కఠిన చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.