న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయాల్లో నైతికత, విలువలకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ప్రతీకగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. జైపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో జైపాల్ రెడ్డి చిత్రపటానికి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, కాంగ్రెస్ నేతలు రోహిణ్ రెడ్డి, తుమ్మల యుగంధర్ తదితరులు పాల్గొని జైపాల్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా ప్రజా ప్రస్థానం ప్రారంభించిన జైపాల్ రెడ్డి..తుది శ్వాస వరకు తన విలువలు, సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. అపారమైన విషయ పరిజ్ఞానం, అద్భుతమైన వాగ్ధాటితో అటు ప్రజల హృదయాల్లో, ఇటు పార్లమెంట్‌లో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ఘనత జైపాల్ రెడ్డిదని కితాబిచ్చారు. ఆయన ఆశయాలను ప్రభుత్వం ఎప్పుడూ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
