దేశం గర్వించ దగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైత్రీవనం సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన సీఎం.. దేశ చరిత్రను మలుపు తిప్పిన ముగ్గురు మహనీయుల లను అందరు గుర్తుపెట్టుకోవాలన్నారు.
అందులో ఒకరు దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన ఓటు హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్, లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచి ప్రపంచం ముందు దేశం తల ఎత్తుకునేలా చేసిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ.. ఆ తర్వాత నీతి, నిజాయితీ, ఉక్కు సంకల్పంతో దేశం గర్వించేలా పాలన సాగించిన మూడో తరం గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు.
ఎన్టీఆర్ ఏ ఒక్క కులానికో, మతానికో, ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదని.. ఆయన ఒక వ్యవస్థ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాడు పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి.. ఎప్పుడూ పాలితులుగా మిగిలిపోయిన బలహీన వర్గాలను పాలకులుగా మార్చిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. ఎంతో మంది సామాన్యులకు ఆయన రాజకీయ భిక్ష పెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఇందిరమ్మ స్ఫూర్తితో పాటు ఎన్టీఆర్ ఆలోచనా విధానాన్ని కూడా అమలు చేస్తోందని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పక్కా ఇండ్ల పథకమే.. నేటి మా ఇందిరమ్మ ఇండ్లు.. నాడు ఆయన తెచ్చిన జనతా వస్త్రాలే.. నేటి ఇందిరమ్మ చీరలకు స్ఫూర్తి. ఆస్తిలో ఆడబిడ్డలకు హక్కు కల్పించిన ఎన్టీఆర్ స్ఫూర్తితోనే.. నేడు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది అని రేవంత్ అన్నారు.
వ్యవసాయాన్ని పండగ చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. నాడు ఎన్టీఆర్ యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తే.. నేడు తమ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని, మొదటి ఏడాదే రికార్డు స్థాయిలో 67 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజా రంజక పాలన సాగుతోందని, 2034 వరకు తెలంగాణలో మాదే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
