- నాణ్యమైన విద్య కోసం ఉపాధ్యాయులు దీక్ష బూనాలె
- విద్యార్థుల సమస్యలపై టీచర్ల సంఘాలు కొట్లాడాలి
- ఐదేండ్లు కష్టపడుదాం.. దేశానికి ఆదర్శంగా నిలుద్దాం
- మీ విదేశీ పర్యటన అనుభవాలు విద్యార్థులకు మేలు చేయాలి
- మండలం యూనిట్‌గా విద్యా ప్రణాళికలు.. డిసెంబర్‌లోపు రిపోర్ట్ ఇవ్వాలి
- ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా పని చేయండి
- ఫిన్లాండ్, జర్మనీ వెళ్లిన టీచర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
- విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాలో చెప్పాలని ప్రతిపక్షాలకు ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: ‘2034 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేనే ఉంటా.. ఇందులో ఎవరికీ.. ఎలాంటి అనుమానం అక్కర్లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఐదేండ్లు మనం కేవలం పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే పిల్లల కోసం అంకితమవ్వాలని టీచర్లకు సూచించారు. ఐదేండ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. మనం ఏం సాధించామో గర్వంగా చెప్పుకోవాలని అన్నారు. గురువారం ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ‘టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్’లో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన టీచర్లు, లెక్చరర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీచర్ల సంఘాల నేతలు సమస్యల పరిష్కారం కోసం తనతో కొట్లాడొద్దని, అవి తాను చూసుకుంటానని చెప్పారు. పిల్లల సమస్యలపై తనతో కొట్లాడాలని, అప్పుడే విద్యావ్యవస్థ మారుతుందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో తాను పని చేయడం లేదని, సమాజ మార్పు కోసమే విద్యాశాఖ బాధ్యతలను తన వద్దే ఉంచుకున్నానని వెల్లడించారు. వచ్చే ఐదేండ్లపాటు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతి టీచర్ దీక్షబూనాలని, తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
రాజీనామా ఎందుకు చేయాలి.?
తనను విద్యాశాఖ మంత్రి బాధ్యతలనుంచి తప్పుకోవాలని కోరుతున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. ‘‘నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నందుకా? 55 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినందుకా? దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న 23 వేల మందికి ప్రమోషన్లు, 30 వేల మందికి బదిలీలు ఇచ్చినందుకా? ఐటీఐలను ఏటీసీలుగా మార్చి, టాటాలాంటి సంస్థల భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? నేను ఎందుకు రాజీనామా చేయాలో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
తాను ఓట్ల కోసమో, రాజకీయం కోసమో పని చేయడం లేద, భవిష్యత్ తరాల కోసమే పని చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత2024 జనవరి నుంచి క్రమం తప్పకుండా ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నట్టు చెప్పారు. ‘‘ఇది మీ ప్రభుత్వం, మీ కోసం పనిచేస్తోంది. పిల్లల చదువుల కోసం, మీ ఇండ్ల లోన్ల కోసం జీతాలు సకాలంలో అందడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అందుకే ఆ నైతిక బాధ్యతను నేను తీసుకున్నాను’’ అని స్పష్టం చేశారు.
ప్రతి విద్యార్థిపై రూ.1.08 లక్షల ఖర్చు..
రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇంత మొత్తం ఖర్చు చేస్తున్నా పేదలు ఇంకా ప్రైవేటు స్కూళ్లకే ఎందుకు వెళ్తున్నారో టీచర్లు ఆలోచించాలన్నారు. ఆస్తులు లేకపోవడం వెనుకబాటుతనం కాదు.. చదువు లేకపోవడమే అసలైన వెనుకబాటుతనమని కుల గణన సర్వేలో తేలిందని చెప్పారు. విద్యార్థుల అభివృద్ధి కోసం పెట్టే ఈ వ్యయాన్ని భవిష్యత్ పెట్టుబడిగా చూస్తున్నట్టు తెలిపారు. తానేం పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో చదవలేదని, కొండారెడ్డిపల్లి లాంటి మారుమూల గ్రామంలో ప్రభుత్వ బడిలోనే చదువుకున్నానని తెలిపారు. ప్రభుత్వ స్కూల్‌లో చదివితే ఏమవుతారని ఎవరైనా అడిగితే.. రాష్ట్రానికి సీఎం అవుతారని గర్వంగా చెప్పాలని సూచించారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు కూడా తనకు ప్రభుత్వ బడిలో నేర్చుకున్న ఆ పునాదే అక్కడ పనికొచ్చిందని, మన పిల్లలను కూడా ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేయడమే తన లక్ష్యమని తెలిపారు.
విద్యా వ్యవస్థలో వికేంద్రీకరణ జరగాలి..
విద్యా వ్యవస్థలో మార్పు కోసం వికేంద్రీకరణ జరగాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని, వచ్చే విద్యా సంవత్సరానికి ఏమేం వసతులు కావాలి..? ఎంత మంది టీచర్లు ఉండాలి..? ప్రతి పిల్లవాడు ప్రభుత్వ బడిలో చేరేలా ఏం చేయాలో డిసెంబర్ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని సూచించారు. విదేశీ పర్యటనకు వెళ్లిన టీచర్లు అక్కడి జ్ఞానాన్ని మన విద్యార్థులకు పంచాలని, ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో ఏటా మరో 10 నుంచి 15 మంది టీచర్లను విదేశాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు.
నెహ్రూ దార్శనికత.. మోదీ అప్పుల కుప్ప!
మన దేశ తొలి ప్రధాని నెహ్రూ వేసిన పునాదులతో నేడు ప్రతి తండాలో స్కూల్ ఉందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా నెహ్రూ అభివర్ణించారని, సాగర్, ఎస్సారెస్పీ వల్లే నేడు మనకు వరి ధాన్యం పండుతోందని తెలిపారు. కానీ కొందరు నెహ్రూపైన కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014 వరకు ఉన్న ప్రధానులందరూ కలిసి రూ.51 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ ఒక్కరే 12 ఏండ్లలో రూ.151 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కాస్తా కూళేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు.
పిల్లలే మన ‘స్ట్రెస్ బస్టర్స్’
ఈ రోజుల్లో మానవ సంబంధాలు చాలా ముఖ్యం. పిల్లలు మన ఒత్తిడిని దూరం చేసే ‘స్ట్రెస్ బస్టర్స్’. ఇంట్లో పిల్లలు ఉంటే భార్యాభర్తల మధ్య కీచులాటలు తగ్గుతాయి. మిడిల్ క్లాస్ ఇండ్లల్లో టీవీ రిమోట్ కోసం గొడవ పడటం, ఆ తర్వాత కలిసి ఉండటంలోనే ఆనందం ఉంటుంది. హాస్టల్ పిల్లల కోసం డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 210 శాతం పెంచాం. టీచర్లకు కూడా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. వచ్చే ఐదేండ్లు ఒక దీక్షలా పనిచేసి మన రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలబెడదాం..
- సీఎం రేవంత్‌రెడ్డి
ఇంగ్లిష్ ఒక భాష మాత్రమే..
చదువుతో పాటు నైపుణ్యం ఉంటేనే బతుకుదెరువు దొరుకుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చైనా, జపాన్ దేశాల్లో ఇంగ్లిష్ రాకపోయినా నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారని గుర్తుచేశారు. అందుకే మనం సంప్రదాయ కోర్సులకు దూరంగా.. ఐటీఐలను టాటా సహకారంతో ఏటీసీలుగా మార్చామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టామని వివరించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నామని చెప్పారు. అలాగే మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాల ప్రాముఖ్యతను పిల్లలకు నేర్పాలని టీచర్లకు విజ్ఞప్తి చేశారు.
మానవ సంబంధాలు లేని దేశాలు అభివృద్ధి చెందలేవని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంసీఆర్‌హెచ్ఆర్డీ డైరెక్టర్ శాంతికుమారి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన టీచర్ల బృందం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి వీక్షించారు.
