V6 News

దళితులు మంత్రులుగా ఉంటే  ఓరుస్తలేరు : సీఎం రేవంత్

దళితులు మంత్రులుగా ఉంటే  ఓరుస్తలేరు : సీఎం రేవంత్
  • దళిత బిడ్డ స్పీకర్​గా ఉన్నారని అసెంబ్లీకి వస్తలేరు: సీఎం రేవంత్​
  • అంబేద్కర్ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రజాపాలన
  • పదేండ్లు ప్రసంగాలు చేసిన నాయకులు ఒక్కసారైనా అంబేద్కర్​ విగ్రహానికి నివాళి అర్పించారా?
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని వెల్లడి
  • అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్​బండ్​పై విగ్రహానికి నివాళి

హైదరాబాద్, వెలుగు: గత పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, వారిని నిర్ణయాధికారానికి దూరం పెట్టి తీరని అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాధికారంలో ఆ వర్గాలకు సింహభాగం కల్పించామని తెలిపారు. అయితే దళితులు మంత్రులుగా ఉంటే ఓరుస్తలేరని సీఎం అన్నారు.   డీలిమిటేషన్ తో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌‌‌‌డ్ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. దక్షిణాది హక్కుల కోసం అందరం కలిసి పోరాడాలని, అప్పుడే అంబేడ్కర్ ఆశయాలను కాపాడుకోగలమని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజాపక్షాన నిలబడి కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సీఎం నివాళి అర్పించారు. ఆ తరువాత  ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక దళిత బిడ్డ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌ను అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టామని, మరో దళిత మేధావి భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవితో పాటు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించామని చెప్పారు. గతంలో భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు, ఆయన దళితుడన్న కారణంతో హోదాను తగ్గించి, అసెంబ్లీలో కనీసం గౌరవం ఇవ్వకుండా చిన్న కుర్చీ వేసి అవమానించిన చరిత్ర గత పాలకులదని గుర్తుచేశారు.

ఇయ్యాల అదే భట్టి విక్రమార్క గంభీరంగా అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌‌‌‌ను ప్రవేశపెడుతుంటే, గత పాలకులు ఆ దృశ్యాన్ని చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోతున్నారని విమర్శించారు. మంత్రివర్గంలో సీతక్క, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్ వంటి నాయకులకు కీలక శాఖలు కేటా యించడమే కాకుండా.. విప్‌‌‌‌లుగా వేముల వీరేశం, రామచంద్ర నాయక్ వంటి వారికి బాధ్యతలు ఇచ్చి పాలనలో భాగస్వాములను చేశామన్నారు. 

ఒకప్పుడు అణగారిన వర్గాల నేతలను చిన్నచూపు చూసిన వారే, నేడు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు వంగి నమస్కరించి, ‘అధ్యక్షా మాకు మైక్ ఇవ్వండి’ అని అడుక్కునే పరిస్థితిని తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇది కేవలం పదవులు ఇవ్వడం మాత్రమే కాదని, ఆయా వర్గాల ఆత్మగౌరవాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలబెట్టడమని పేర్కొన్నారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, 110 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా ఒక దళిత బిడ్డను వైస్ చాన్స్​లర్‌‌‌‌గా నియమించి విద్యా రంగంలోనూ సామాజిక న్యాయాన్ని అమలు చేశామన్నారు. అంబేద్కర్ చెప్పిన ‘రాజ్యాధికారమే మాస్టర్ కీ’ అనే నినాదాన్ని తాము నిజం చేస్తున్నామని, నిర్ణయాధికారంలో ఈ వర్గాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి అండగా నిలబడుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

తాము నిరంతరం పనిచేస్తుంటే.. వెనక నుంచి కొందరు కుట్రలు చేసి, గోతులు తవ్వుతున్నారన్నారు. గోతులు తవ్వే వారిని ఆ గోతిలోనే పాతిపెట్టే పని మీరు చేయాలని.. పదేళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. గత పదేళ్లలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన నాయకులు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారా అని ప్రశ్నించారు.

కులగణన లెక్కలతోనే సంక్షేమ పథకాలు

అంబేద్కర్ ఆశించిన విధంగా ఎవరి జనాభా ఎంత ఉందో లెక్క తేలితేనే, ఆ మేరకు నిధులు, పదవుల్లో వాటా లభిస్తుందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు 56.33 శాతం ఉన్నాయని ప్రాథమిక లెక్కలు చెబుతున్నాయని చట్టబద్ధత కల్పిస్తామన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి అందాల న్నదే తమ ఉద్దేశమన్నారు. కులగణనతో లభించిన సమాచారం ఆధారంగా భవిష్యత్తులో సంక్షేమ పథకాల ను రూపొందిస్తామని వివరించారు. ఇది కేవలం గణాం కాల సేకరణ కాదని, సామాజిక మార్పుకు నాంది అని అభివర్ణించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి ఈ కులగణన ఒక మైలురాయిగా నిలుస్తుందని, దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి అమలు కావాలని తాము కోరుకుంటున్నట్లు సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.

ఉద్యమంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీల పాత్ర మరువలేం

 అంబేద్కర్ చెప్పిన విధంగా విద్య ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ప్రారంభిస్తున్నా మన్నారు.  కులమతాలకు అతీతంగా విద్యార్థులం దరూ ఒకే చోట చదువుకునేలా 25 ఎకరాల విస్తీ ర్ణంలో అత్యాధునిక వసతులతో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు గురు కులాలను వేరువేరుగా ఉంచి అంతరాలను పెంచాయని, తాము వాటిని తొలగిస్తున్నామని చెప్పారు. 

రాష్ట్రం ఏర్పడటానికి ప్రధాన కారణం అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టిక ల్ 3 అన్నారు. అంబేడ్కర్ ఆనాడే చిన్న రాష్ట్రాల ఆవ శ్యకతను గుర్తించి, రాజ్యాంగంలో ఆ అధికారాన్ని కల్పించారని, అందుకే సోనియా గాంధీ సాహసో పేతమైన నిర్ణయం తీసుకుని తెలంగాణను ఇచ్చార ని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల పాత్ర మరువలేనిదన్నారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే 67,000 పైచిలుకు ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టామని తెలిపారు. ఈ ఉద్యోగాల్లో 87 శాతం అంటే సుమారు 50 వేలకుపైగా ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే దక్కడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నా రు.  ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా దళిత, గిరిజ న కుటుంబాలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తున్నా మని తెలిపారు.