- ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్
- పాల్గొననున్న ఏడీలు, జేడీలు, డీఈఓలు
- టీచర్లు, అధికారుల అనుభవాలు తెలుసుకోనున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ఇటీవల ఫిన్లాండ్ పర్యటనకు వెళ్లిన టీచర్లు, విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 28న ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని దాశరథి ఆడిటోరియంలో 'ఇంటరాక్షన్ ప్రోగ్రామ్' జరగనుంది. ఫిన్లాండ్‌లో అమలవుతున్న విద్యా విధానం, అక్కడి మంచి పద్ధతులను తెలంగాణలో ఎలా అమలు చేయాలనే అంశంపై చర్చించనున్నారు.
పర్యటనకు వెళ్లిన టీచర్లు, అధికారులు తమ అనుభవాలను సీఎంతో పంచుకోనున్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల డీఈఓలు, జేడీలు, అడిషనల్ డైరెక్టర్లు, హెచ్‌వోడీలు హాజరు కావాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. అలాగే ఫిన్లాండ్‌కు వెళ్లిన టీచర్లు పనిచేస్తున్న పాఠశాలల ఎంఈఓలు, హెడ్‌మాస్టర్లు కూడా పాల్గొననున్నారు. సమావేశానికి అధికారులు, టీచర్లు హాజరయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
