మద్దూరు/నకిరేకల్, వెలుగు : ఈ నెల 4న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో, 5న నకిరేకల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయా చోట్ల ప్రభుత్వ అధికారులు, ప్రజాపత్రినిధులు ఏర్పాట్లను పరిశీలించారు. మద్దూరులో నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ వినీత్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌తో కలిసి హెలిప్యాడ్ స్థలంతో పాటు, చింతల్ దిన్నె రోడ్డు సమీపంలోని గురుకుల కళాశాల, రేణివట్ల రోడ్డు సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలను వారు పరిశీలించారు. సీఎం ప్రయాణించే రూట్, హెలిప్యాడ్ నుంచి కార్యక్రమ ప్రాంతాల వరకు చేపట్టాల్సిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వీవీఐపీ రూట్‌కు సంబంధించిన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
నకిరేకల్‌లోని మినీ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి పరిశీలించారు. ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని, సీఎం పర్యటనలో భాగంగా 100 పడకల ఆసుపత్రి ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఉంటాయని ఆయన తెలిపారు. సీఎం సభను ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
