- భూములు కోల్పోయే ఏ ఒక్క పేదవాడినీ రోడ్డున పడేయం
- నిర్వాసితులకు అక్కడే ఇండ్లు, మెరుగైన నష్టపరిహారం
- శంషాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైలకు బుల్లెట్ ట్రైన్స్
- కేంద్రం నుంచి ఇప్పటికే లైన్ క్లియర్.. రవాణా హబ్‌గా మారనున్న శివార్లు
- కేటీఆర్.. వానకు కట్టిన పిట్టగూళ్లు పడగొట్టే రకం
- పర్యాటక రంగంతో యువతకు ఉపాధి.. పాలనలో వేగం కోసం 99 రోజుల ప్రగతి ప్రణాళిక
- బుద్వేల్ రేడియల్ రోడ్ పనులకు శంకుస్థాపన, కొత్వాల్‌గూడలో ఎకో హిల్ పార్క్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శంషాబాద్ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాలను భారీ రవాణా హబ్‌గా మార్చబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాబోయే ఐదేండ్లలో శంషాబాద్ జంక్షన్ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై, పుణె, ముంబైలకు బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయన్నారు. గంటల వ్యవధిలోనే ఇతర మెట్రో నగరాలకు చేరుకునేలా కేంద్రం నుంచి ఇప్పటికే లైన్ క్లియర్ చేసుకున్నట్టు సీఎం ప్రకటించారు. బుద్వేల్ లేఅవుట్‌ను అనుసంధానించే అత్యంత కీలకమైన రేడియల్ రోడ్- 2 ఇంటర్ చేంజ్ పనులకు శుక్రవారం సీఎం శంకుస్థాపన చేశారు.
అనంతరం కొత్వాల్‌గూడలో ఆహ్లాదాన్ని పంచేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఎకో హిల్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డుకు దీటుగా రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లతో పాటు 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని నిర్మించబోతున్నట్టు తెలిపారు. కాగా, ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోయే ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేయబోమని హామీ ఇచ్చారు.
భూ నిర్వాసితులకు మెరుగైన నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ప్రత్యామ్నాయంగా వారికి అదే ప్రాంతంలో నివాస సదుపాయం కల్పిస్తామన్నారు. మురికివాడల్లో నివసించే వారిని దూరం పంపకుండా, వారి నియోజకవర్గాల్లోనే ప్రభుత్వ స్థలాలు గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. నగరాభివృద్ధి జరిగితే భూముల ధరలు పెరిగి స్థానికులకే లాభం చేకూరుతుందని, రంగారెడ్డి జిల్లాకు ఇప్పుడున్న భారీ డిమాండే ఇందుకు నిదర్శనమన్నారు.
ఒకప్పుడు నిజాం నవాబులు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులే నేటికీ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో మూసీ నదిని ప్రక్షాళన చేసి సబర్మతి, యమునా రివర్ ఫ్రంట్ల తరహాలో ఉపాధి కేంద్రంగా మార్చుతామని తెలిపారు. పేదలకు విదేశాలకు వెళ్లే ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టే, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఇక్కడే అద్భుత కట్టడాలు నిర్మిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాత్రివేళల్లో సైతం వ్యాపారాలు కొనసాగేలా ‘నైట్ ఎకానమీ’తో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.
40 ఏండ్లు పదవులు అనుభవించి.. ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నరు
హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫామ్ హౌస్‌లలో విలాసవంతమైన జీవితం గడిపే ఆధిపత్య వర్గాలకు, మూసీ మురికివాడల్లోని పేదల కష్టాలు, కన్నీళ్లు ఏమాత్రం అర్థం కావన్నారు. 40 ఏండ్లుగా పదవులు అనుభవించిన ఓ మహిళా నేత, ఇప్పుడు తన ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుపడటం శోచనీయమని మండిపడ్డారు.
ప్రభుత్వం ఏది చేసినా అడ్డుకుంటానని విర్రవీగే కేటీఆర్ లాంటి నాయకులు, వానకు కట్టిన పిట్టగూళ్లను పడగొట్టే తరహా మనస్తత్వం కలవారని ఎద్దేవా చేశారు. ఇలాంటి రాజకీయ అడ్డంకులను అధిగమించి, స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ కలుపుకుని నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. నాలుగుసార్లు ఓటమి ఎరుగకుండా గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, నిరంతరం ప్రజల్లో ఉండే మనిషి కాబట్టే అది సాధ్యమైందన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సానుకూల దృక్పథంతో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని మెచ్చుకున్నారు.
పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే పరోక్ష ఉపాధి..
యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలంటే, వారికి విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అన్నారు. ఇందుకోసం నగర శివారు ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా వేలాది మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ఎకో పార్క్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఆటోలు, టాక్సీలు, హోటళ్లు, లాడ్జీలు నడుపుకునే చిన్న వ్యాపారులకు లాభం చేకూరుతుందన్నారు.
చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోటల సరసన ఈ కొత్త పార్కులు, రివర్ ఫ్రంట్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షించబోతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు ఐటీ, ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వ భూములను గుర్తించి, పకడ్బందీగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిబద్ధతతో తీసుకుంటున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మహిళలు, యువత, స్థానిక ప్రజలందరూ నిండు మనసుతో ఆశీర్వాదం అందించాలని కోరారు. అందరి అండదండలతో హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు.
వర్గీకరణ ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు..
గత పాలకులు దళితులు, బలహీనవర్గాలకు బర్రెలు, గొర్రెలు ఇచ్చి కుల వృత్తులకే పరిమితం చేస్తే, తమ ప్రభుత్వం వారికి నాణ్యమైన విద్యనందించి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగా, వర్గీకరణ ఒక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారం కాదని, ప్రమోషన్లు, ఉన్నత విద్య, అసైన్డ్ భూముల రక్షణ లాంటి ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈ సమస్యల పరిష్కారానికి తాను ముందుకెళ్తున్నప్పుడు, వెనుక నుంచి జరిగే దాడులను తిప్పికొట్టే బాధ్యతను దళిత మేధావులు, ఉద్యోగులు తీసుకోవాలని సీఎం కోరారు. మాదిగ ఎంప్లాయిస్ కో- ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సీఎం అభినందన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహాభారతంలోని కర్ణుడు, బార్బరికుడి పాత్రల మాదిరి తాను కూడా.. బలహీనుల పక్షాన నిలబడటమే తన విధానమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి కళ్లు, చెవులని అభివర్ణించిన ఆయన.. రాబోయే 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ను చిత్తశుద్ధితో అమలు చేసి పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలని పిలుపునిచ్చారు.
ప్రతి నెలా ప్రభుత్వంపై రూ.వెయ్యి కోట్ల ఆర్థిక భారం పడుతున్నా.. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజీ పడటం లేదన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తున్న తనకు ప్రజలు రేవంత్ మాదిగ, రేవంత్ గౌడ్, డేవిడ్ రేవంత్, రేవంతుద్దీన్ అని పేర్లు పెట్టినా సంతోషంగా స్వీకరిస్తానని తెలిపారు. దళితుల ఆత్మగౌరవ ప్రతీకలైన నింబోలి అడ్డ హాస్టల్, భవన నిర్మాణాలకు సంబంధించిన నిధులను వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంచడానికి ప్రభుత్వాల వద్ద భూములు లేకపోయినా, చదువు ద్వారా చైతన్యం నింపి బడుగు వర్గాలను దారిద్య్రరేఖ నుంచి శాశ్వతంగా బయటపడేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చెప్పారు.
దశాబ్దాల దళిత వర్గాల పోరాటాలకు, ప్రాణ త్యాగాలకు ముగింపు పలికి వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మాదిగ సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా వారు కోరిన భవనాలు, హాస్టళ్ల నిర్మాణాలకు ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి నాటికి నిధులు మంజూరు చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఎన్నో ఏండ్లుగా అనేక కమిషన్లు, నివేదికల చుట్టూ తిరుగుతూ ఎందరో యువకులు ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర మాదిగ సమాజానిదన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈ వర్గాల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తాను, వారి పక్షాన నిలబడి పోరాడానని సీఎం తెలిపారు.
గతంలో శాసనసభలో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, నాటి పాలకులు తనను సభ నుంచి బయటకు గెంటివేసిన ఘటనను గుర్తు చేశారు. రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ, న్యాయం దళితుల వైపు ఉండటం వల్లే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క తదితర మంత్రులు, అధికారుల సమన్వయంతో దేశంలోనే తొలిసారిగా వర్గీకరణను అమలు చేసి చారిత్రక ఘట్టానికి తెరతీశామన్నారు.
పాలనలో వేగం పెంచేందుకే..
మహిళల సంక్షేమం, వారి ఆత్మగౌరవమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పథకాలను అమలు చేస్తోందని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండి, పొలాల్లో పక్షులను బెదిరించేందుకు మాత్రమే పనికొచ్చాయని ఎద్దేవా చేశారు. కానీ, దసరా పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పాలపిట్ట రంగు ఇందిరమ్మ చీరల్లో మహిళలు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఆడబిడ్డలు మరింత మెచ్చుకునేలా విభిన్న రంగుల్లో, అత్యంత నాణ్యమైన చీరలను బహుమతిగా అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులకు సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గడిచిన పదేండ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వని వారు, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా మారిందన్నారు. పాలనలో వేగం పెంచేందుకు, వందశాతం లక్ష్యాలు చేరుకునేందుకు 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’కు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు, పేదరిక నిర్మూలనకు నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
