V6 News

కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాళేశ్వరం.. రీ డిజైన్ పేరుతో భారీ అవినీతి: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాళేశ్వరం.. రీ డిజైన్ పేరుతో భారీ అవినీతి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం (ఏప్రిల్ 20) సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించడంతో పాటు దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ ప్రణాళికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆనాడు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. 

రూ.38 వేల 500 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల అంచనాలు వేశారు. ప్రాణహిత చేవెళ్ల కోసం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు కూడా చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు లేవని కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టారు. ప్రాజెక్ట్ పేరు, ఊరు  మార్చి కాళేశ్వరంగా పేరు పెట్టారు. రూ.35 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు ప్రాజెక్టు అంచనాలు పెంచారు. 

కాళేశ్వరం అద్బుతమైన ప్రాజెక్టు అని భ్రమలు కల్పించారు. 2023 అక్టోబర్‎లో కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ వంటిదైనా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. కేసీఆర్ అవినీతిని ప్రకృతే బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టులో సమస్యలపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలను నివేదిక బయటపెట్టింది. 

ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారు. కమీషన్ల కోసం తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. రూ.35 వేల కోట్ల ప్రాజెక్టును లక్ష కోట్లకు తీసుకెళ్లారు. లక్ష ఎకరాలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాలు కూడా పారలేదు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేసే పరిస్థితి లేదు. నిపుణులతో చర్చించి మరమ్మతులపై దృష్టి పెట్టాం’’ అని చెప్పారు.