హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక చొరవ చూపాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్ల బదిలీల కోసం ఏపీ తరహాలో తెలంగాణలోనూ శాశ్వత ప్రాతిపదికన బదిలీల చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోపు సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలీ నివేదికలు ప్రవేశపెట్టారు. మీటింగ్ లో రాష్ట్ర నేతలు పర్వత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఏవీ సుధాకర్, రాధా జయలక్ష్మి, కృష్ణారెడ్డి, వీరరాఘవులు, పరమేశ్ పాల్గొన్నారు.
