V6 News

రాంపూర్‭లో అభివృద్ధే ప్రధాన అస్త్రంగా యోగి ప్రసంగం

రాంపూర్‭లో అభివృద్ధే ప్రధాన అస్త్రంగా యోగి ప్రసంగం

ఉత్తరప్రదేశ్‭లో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైన సందర్భంగా అజంగఢ్ లో పర్యటించారు. అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాంపూర్, అజంగఢ్ లోక్‭సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... అధికారులకు యోగి దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోడీ విధానాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ రెండు జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించాలని సంబంధింత శాఖలకు యోగి ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రతిపాదన పెండింగ్‭లో ఉండకూడదని చెప్పారు. బిలాస్ పూర్ చక్కెర కర్మాగారాన్ని బలోపేతం చేసే పనులు త్వరగా జరగాలని చెప్పారు. 

భారీ స్థాయిలో అభివృద్ధి పనులు

రాంపూర్‌ అభివృద్ధి పనుల విషయానికి వస్తే.. యోగి ఆదిత్యనాథ్‌ తొలిసారి అధికారంలోకి వచ్చాక రూ.3 వేల కోట్ల రూపాయలకుపైగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం లభించింది. వీటిలో చాలా పనులు కూడా పూర్తయ్యాయి. 2022 జనవరి 1వ తేదీన యోగి రూ.96 కోట్ల అభివృద్ధి పనులను కానుకగా అందజేశారు. అదే రోజు రాథోండ జాతర మైదానంలో తన బహిరంగ సభలో ప్రసంగించడానికి ముందు.. 25 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రణాళికల పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొన్ని పూర్తయ్యాయి. కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి.

రాంపూర్ ఉపఎన్నిక పోరులో అభివృద్ధే ప్రధాన అస్త్రంగా మారనుంది. యోగి తీసుకువచ్చిన లా అండ్ ఆర్డర్ మోడల్ దేశానికే ఆదర్శంగా మారిందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. తాజాగా విపక్షాలకు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో.. బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అయితే.. గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీకి కంచుకోటగా ఉన్న అజంగఢ్, రాంపూర్ స్థానాలను ఎస్పీ నుంచి బీజేపీ కైవసం చేసుకుంది.  దివంగత ములాయం సింగ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా అజంగఢ్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అదే విధంగా రాంపూర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజాపై బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ లోధి విజయం సాధించారు. రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆజంఖాన్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై అనర్హత వేటు పడిన తర్వాతే ఉపఎన్నికలు జరుగుతున్నాయి. రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న తర్వాతే.. రాబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ బీజేపీ తన సత్తా నిరూపించుకోవాలని చూస్తోంది.