భార్య బాధితులుగా నవ్వులు పూయించిన ముగ్గురు టైగర్స్ మళ్లీ వచ్చేశారు. గతంలో వచ్చిన 'సేవ్ ది టైగర్స్' రెండు సీజన్లు ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు క్రేజీ, ఫాంటసీ కాన్సెప్ట్‌తో 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' వచ్చేసింది. మహి వి. రాఘవ్ క్రియేషన్‌లో, శ్రీరామ్ ఎరగం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సీజన్ 3 జూన్ 18 నుంచి జియోహాట్‌స్టార్‌లో (JioHotstar) స్ట్రీమింగ్ అవుతుంది. ఈ లేటెస్ట్ సీజన్.. పాత ఫ్లేవర్‌ని మిస్ అవ్వకుండానే సరికొత్త ట్విస్టులతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది.
కథేంటంటే?
ఈసారి కథ ఎక్కడో రోడ్ల మీద కాదు, నేరుగా స్వర్గలోకంతో కనెక్ట్ అయింది. రాహుల్ (అభినవ్ గోమఠం) జాబ్ పోయి భార్య మాధురి (పావని గంగిరెడ్డి)కి చెప్పలేక సతమతమవుతుంటాడు. గంటా రవి (ప్రియదర్శి) ఎమ్మెల్యే టికెట్ కోసం పైసలన్నీ తగలేసి, భార్య హైమా (సుజాత) తిట్లు పడలేక కొత్త గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతాడు. ఇక విక్రమ్ (చైతన్య కృష్ణ) భార్య రేఖ (దేవియాని శర్మ) నుంచి విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కుతాడు. . పైగా కోర్టులో భార్య నుంచే భరణం కావాలని అడుగుతుంటాడు.
ఈ పెళ్లిళ్ల కాన్సెప్ట్ తెచ్చింది ఎవరు? అని ఫ్రస్ట్రేషన్‌లో వీరు ముగ్గురు దేవుడిని బూతులు తిట్టడంతో.. స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి (వెన్నెల కిషోర్) మైండ్ బ్లాక్ అవుతుంది. వారి సమస్య తీర్చమని చిత్రగుప్తుడిని (గుండు సుదర్శన్) భూమికి పంపుతాడు. చిత్రగుప్తుడు వచ్చి ఒక క్రేజీ ఆఫర్ ఇస్తాడు. ఈ మొదటి లోకంలో ఉన్న ముగ్గురు భర్తలను, వేరే లోకంలో (ప్యారలల్ యూనివర్స్) ఉన్న సేమ్ టూ సేమ్ ముగ్గురు భర్తలతో రీప్లేస్ చేస్తాడు. రూపాలు ఒకటే కానీ బుద్ధులు వేరు. ప్రజల కోసం బతికే గంటా రవి ప్లేస్‌లోకి, ప్రజలను దోచుకునే నెగెటివ్ రవి వస్తాడు. మరి ఈ 'లోకాల మార్పిడి' వల్ల ఎలాంటి రచ్చ జరిగింది? ఆ తర్వాత భార్యలతో వీరు పడ్డ తిప్పలేంటి? అనేదే అసలు కథ.
అదరగొట్టిన పర్ఫార్మెన్స్ ..
ఎప్పటిలాగే ప్రియదర్శి తన తెలంగాణ యాసతో, అభినవ్ గోమఠం వన్-లైనర్స్ అండ్ టైమింగ్‌తో ఇరగదీశారు. అయితే ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మాత్రం చైతన్య కృష్ణే. ఒక ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్‌గా ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవెల్. భార్యలుగా చేసిన సుజాత, పావని, దేవియాని తమ రోల్స్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ముఖ్యంగా భర్తకు భయపడే అమాయకురాలిగా దేవియాని నవ్విస్తుంది. ఇక రోహిణి కామెడీ టైమింగ్, గుండు సుదర్శన్ యాక్టింగ్ సిరీస్‌కు పెద్ద అసెట్. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా.. ఆయన పాత్రను మరికొంత వాడుకుంటే బాగుండేది..
►ALSO READ | PM Modi: 'ధురంధర్' ట్రెండ్‌లో ప్రధాని మోడీ.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ తరహాలో స్పెషల్ వీడియో లాంచ్ చేసిన బీజేపీ!
ఎలా ఉందంటే..?
గత రెండు సీజన్లు చాలా రియలిస్టిక్‌గా ఉంటే, ఈ మూడో సీజన్‌కు ఫాంటసీ, ప్యారలల్ వరల్డ్ టచ్ ఇచ్చి మరింత క్రేజీగా మార్చారు. ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగెటివ్ కోణాలు ఉంటాయనే సందేశాన్ని కామెడీతో పాటు అంతర్లీనంగా చూపించారు. భార్య అంటే భర్తకు బానిస కాదు అని చెప్పే సీన్లు, మహిళా సాధికారత గురించిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. మధ్యలో ఒకటి రెండు ఎపిసోడ్‌లు కొంచెం సాగదీసినట్లు అనిపించినా, క్లైమాక్స్ మాత్రం ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మొత్తంగా చూస్తే.. కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఉన్నప్పటికీ, ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకోవడానికి 'సేవ్ ది టైగర్స్ 3' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
