హైదరాబాద్ సిటీ, వెలుగు: అధికారిక లోగో రూపకల్పన కోసం సీఎంసీ ప్రతిష్టాత్మక డిజైన్ పోటీని ప్రకటించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, డిజైనర్లు, నిపుణులు తమ ప్రతిభను చాటుకోవచ్చు. లోగో డిజైన్‌లో సుపరిపాలన, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం వంటి విలువలు ఉట్టిపడాలి. ఎంట్రీలను ఏఐ లేదా వెక్టర్ ఫార్మాట్‌లో సమర్పించాలి.
అధిక నాణ్యత గల పీఎన్ జీ లేదా జేపీఈజీ ఫైల్‌తో పాటు గరిష్ఠంగా 250 పదాల్లో డిజైన్ వెనుక ఉన్న తాత్వికత(డిజైన్ ఫిలాసఫీ)ను జత చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఒక్కో అభ్యర్థి ఒక్క ఎంట్రీ మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని, కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించినవి లేదా ఏఐ ద్వారా నకలు చేసిన డిజైన్లు పరిగణలోకి తీసుకోబోమన్నారు.
పోటీలో ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేల నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 5 వరకు ఎంట్రీలు స్వీకరిస్తామని, 10న విజేతలను ప్రకటించి, 15న లోగోను ఆవిష్కరిస్తామన్నారు. పూర్తి వివరాలకు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని సూచించారు.
